‘రామాయణ’ పార్ట్ 2 లో ఆ పాత్ర అదిరిపోతుంది..!

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సినిమా ‘రామాయణ’. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,500 కోట్ల మార్కును దాటేసి, ఇప్పుడు 2 వేల కోట్ల మైలురాయి దిశగా దూసుకెళుతోంది.మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో ప్రేక్షకులందరి దృష్టి ఇప్పుడు రామాయణ పార్ట్ 2 పైనే ఉంది. సాధారణంగా పార్ట్ 2 అనగానే శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ మధ్య జరిగే భీకర యుద్ధమే ప్రధాన ఆకర్షణ అని అందరూ అనుకుంటున్నారు. కానీ, రణ్‌బీర్ కాదు, యష్ కాదు.. పార్ట్ 2లో అసలైన హీరో ఆయనే అంటూ ప్రముఖ నటుడు అజింక్య దేవ్ ఒక సంచలన రహస్యాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రను అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేశారు. రణ్‌బీర్ కపూర్ – శ్రీరాముడిగా, సాయి పల్లవి – సీతాదేవిగా, రవి దూబే – లక్ష్మణుడిగా, యష్ – రావణుడిగా , వీరితో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ఆదినాథ్ కోఠారే, అరుణ్ గోవిల్, లారా దత్తా వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరిసి సినిమా స్థాయిని మరో శిఖరానికి తీసుకెళ్లారు. మొదటి భాగం సృష్టించిన ఈ సంచలన విజయంతో ఇప్పుడు రెండో భాగంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు అజింక్య దేవ్ రామాయణ పార్ట్ 2 గురించి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే అప్డేట్స్ పంచుకున్నారు. మొదటి అప్డేట్ షూటింగ్ గురించి.. ఇప్పటికే సినిమా రెండో భాగానికి సంబంధించిన చాలా వరకు చిత్రీకరణ పూర్తయిందని అజింక్య వెల్లడించారు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం ఇంకా మరింత భారీ స్థాయిలో, అబ్బురపరిచే విజువల్స్‌తో తెరకెక్కుతోందని ఆయన స్పష్టం చేశారు. ఇక రెండో భాగంలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనుండటమే ఈ భాగానికి ప్రధాన ఆకర్షణ అని అజింక్య దేవ్ పేర్కొన్నారు. రణ్‌బీర్ కపూర్, యష్ లాంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, రెండో భాగంలో లంకా దహనం, సంజీవని పర్వతం, రామరావణ యుద్ధంలో హనుమంతుడి పాత్రకు ఉండే ప్రాధాన్యత, దానికి సన్నీ డియోల్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే రామాయణ పార్ట్ 3 గురించి నేను ఇప్పటివరకు వినలేదు. అందుకే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. అయితే, చిత్ర నిర్మాతల్లో ఎవరైనా ఈ విషయాన్ని ప్రస్తావించి ఉంటే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా జరిగితే సినిమాలో నా విశ్వామిత్రుడు పాత్రకు మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంటుంది అని ఆయన అన్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న రామాయణ పార్ట్ 2 ను 2028లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.



