రైతులకు బిగ్ రిలీఫ్..పాత రుణాలు రీషెడ్యూల్..యాసంగికి కొత్త రుణాలు..!

సరైన వర్షాలు పడక, కళ్లముందే పంటలు ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న 365 కరువు మండలాల్లోని రైతుల పంట రుణాలను తక్షణమే రీషెడ్యూల్ చేయాలని ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతుల రుణాల రికవరీ కోసం ఎలాంటి ఒత్తిడి చేయవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెట్టొద్దని, బ్యాంకుల నుంచి ఎలాంటి రికవరీ నోటీసులు పంపొద్దని సూచించింది. కరువు మండలాలకు సంబంధించి పంట రుణాల పూర్తి వివరాలపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కి ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో కరువు తీవ్రతతో దిక్కుతోచని స్థితిలో ఉన్న లక్షలాది మంది రైతులకు ఊరట లభించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎస్ఎల్బీసీకి 58,152 కోట్ల భారీ పంట రుణాల పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, రికార్డుల్లో చూస్తే బ్యాంకర్లు ఇప్పటికే 80 శాతానికి పైగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం మరోలా ఉంది. పాత బకాయిలను కొత్తవిగా చూపిస్తూ బ్యాంకులు కేవలం బుక్ అడ్జస్ట్మెంట్స్ చేశాయే తప్ప, రైతుల చేతికి నేరుగా అందిన నగదు చాలా తక్కువ. ఒకవైపు చేతిలో పెట్టుబడి లేక, మరోవైపు ప్రకృతి పగబట్టి పంటలు చేతికి రాకపోవడంతో రైతులు బ్యాంకుల అసలు, వడ్డీలు చెల్లించలేని దీనస్థితిలో కూరుకుపోయారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుంది.ప్రభుత్వం ప్రకటించిన 365 కరువు మండలాల్లో సుమారు 20 వేల కోట్ల మేర పంట రుణాలు ఉంటాయని ప్రాథమిక అంచనా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్బీఐ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలను వెంటనే టర్మ్ లోన్లుగా మార్చబోతున్నారు. దీనివల్ల రైతులకు తమ రుణాలను వాయిదాల పద్ధతిలో తీర్చుకోవడానికి మూడు నుంచి ఐదేండ్ల వరకు అదనపు సమయం దొరుకుతుంది. ఈ రీషెడ్యూలింగ్ ప్రక్రియ వల్ల రైతులు డిఫాల్టర్లుగా మారకుండా కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో వారికి అప్పులు పుట్టకుండా చేసే సిబిల్ స్కోర్ ఏమాత్రం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసే బాధ్యతను ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది.



