POK వెంటనే అప్పగించేయాల్సిందే..పాకిస్థాన్‌కు ఫైనల్ అల్టిమేటం!

భారత భూభాగాన్ని ఆక్రమించుకుని, అక్కడి నుంచి దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని, దాన్ని భారత్ నుండి విడదీయడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేసింది. చరిత్రను ఒకసారి తిరగేస్తే, 1947 అక్టోబర్‌లో అప్పటి జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్.. తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ అధికారిక పత్రాలపై సంతకం చేశారు. చట్టబద్ధంగా కాశ్మీర్ మొత్తం భారతదేశానిదే. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ గిరిజనుల ముసుగులో సైన్యాన్ని పంపి కాశ్మీర్‌లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్.ఇప్పుడు ఆ భూభాగాన్ని పాకిస్థాన్ వెంటనే ఖాళీ చేసి, భారతదేశానికి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ మాదే అని పాకిస్థాన్ ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై నాటకాలు ఆడుతుంటుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మన జమ్మూ కాశ్మీర్ దశ తిరిగిపోయింది. ఎటుచూసినా కొత్త హైవేలు, స్మార్ట్ సిటీలు, ఎయిమ్స్ , ఐఐటీ లాంటి విద్యా సంస్థలతో కాశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో పర్యాటకులు క్యూ కడుతున్నారు. కానీ బోర్డర్ అవతల ఉన్న పీఓకే పరిస్థితి చూస్తే దారుణంగా ఉంటుంది. కనీస మౌలిక వసతులు, సదుపాయాలు లేకుండా ఇన్నాళ్లూ వాళ్లను పాక్ సైన్యం ఒక బానిసల్లా చూసింది. తమ హక్కుల కోసం రోడ్లపైకి వస్తే పాక్ రేంజర్లు వారిపై కాల్పులు జరిపి చంపేస్తున్నారు. ఈ వాస్తవాలను బీజేపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటో భారత్‌ను చూసి నేర్చుకోవాలని, మీ సొంత ప్రజలకే తిండి పెట్టలేని స్థితిలో ఉండి, కాశ్మీర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పాకిస్థాన్‌కు లేదని తెగేసి చెప్తున్నారు.



