SENA దేశాల్లో ఆ ఘనత సాధించిన రాహుల్…వెల్లింగ్టన్ టెస్టులో పటిష్ట స్థితిలో భారత్

టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను కలిపి ‘SENA’ దేశాలుగా పిలుస్తారు. ఈ నాలుగు వేదికలపై బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ ఒక పెద్ద పరీక్షే. బంతి వేగంగా దూసుకురావడం, స్వింగ్, సీమ్ కదలికలు బౌలర్లకు బాగా కలిసొస్తాయి. అందుకే ఇక్కడ పరుగులు చేయడం అంత సులభం కాదు. భారత ఉపఖండంలోని స్పిన్ పిచ్‌లతో పోలిస్తే SENA గడ్డపై ఆడటానికి భిన్నమైన నైపుణ్యం అవసరం. ఓర్పు, నేర్పు బ్యాటర్‌కు ఉండాలి. క్రీజులో కుదురుకున్నాక కూడా ఏకాగ్రత కోల్పోకుండా నిలబడగలగాలి. తాజాగా ఈ నాలుగు SENA దేశాల్లోనూ టెస్టు సెంచరీ సాధించిన భారత ఓపెనింగ్ బ్యాటర్‌గా కే.ఎల్. రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓపెనర్‌గా కొత్త బంతిని ఎదుర్కొంటూ ఈ ఘనత అందుకోవడం అతని బ్యాటింగ్ పరిణతికి నిదర్శనం. విదేశీ గడ్డపై రాహుల్ ప్రదర్శించిన నిలకడ ఈ మైలురాయితో మరోసారి స్పష్టమైంది. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ మొదటి టెస్టులో బౌలర్ల సమష్టి కృషితో భారత్ ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును 368 పరుగులకే కట్టడి చేయగలిగిన సంగతి తెలిసిందే.
రెండో రోజు జరిగిన ఆటలో మొదటి ఇన్నింగ్ ఆరంభించిన భారత్ కు యశస్వీ జైస్వాల్ 85 (89; 16x4), కే.ఎల్.రాహుల్ 52 నాటౌట్ (116; 5x4) శుభారంభం అందించారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ భాగస్వామ్యం భారత్‌కు మ్యాచ్‌లో మంచి ఆధిక్య దిశగా అడుగులు వేసేందుకు బలమైన పునాది వేసింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా కే.ఎల్.రాహుల్ 136 ( 290; 9x4, 2x6) సెంచరీతో అరుదైన రికార్డును సాధించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా మూడో రోజు మంచి ఆధిపత్యం కనబరిచారు. శుభ్ మాన్ గిల్ 98 (146; 9x4, 2x6) కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. శతకం చేజారినా జట్టు స్కోరు వేగంగా పెరగడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు.



