అప్పుల ఊబిలో పాకిస్థాన్.. టాప్ ఎకానమీగా ఎదుగుతామంటున్న ప్రధాని!

ఒక వైపు తమ దేశం దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాత్రం ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలా ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమ దేశం.. 2050 నాటికి ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఒక విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తూ గొప్పలు చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అక్కడి పాలకులు ఎప్పుడూ ఏదో ఒక కొత్త నాటకానికి తెరతీస్తూనే ఉంటారు. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. 2050 నాటికి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఆరవ స్థానానికి చేరుకుంటుందని దేశ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికను రెడీ చేస్తున్నామని, కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. అయితే పాకిస్థాన్ ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం కేవలం తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, అప్పుల మీద అప్పులు చేయడమే. ఈ వాస్తవాన్ని అంగీకరించని పాలకులు, తాము ఒక అద్భుతమైన రోడ్‌మ్యాప్ తయారు చేశామని, రాబోయే పాతికేళ్లలో దేశ ముఖచిత్రం మారిపోతుందని ప్రజలకు మాయమాటలు చెప్తూనే వస్తున్నారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడానికి యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెడతామని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లను అభివృద్ధి చేస్తామని షరీఫ్ చెబుతున్నారు.
అయితే పాకిస్తాన్ లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒకవైపు పెరిగిపోయిన ద్రవ్యోల్బణం , మరోవైపు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. పాక్ ఇప్పుడు పీకల్లోతు అప్పుల ఊబిలో ఉంది. ఒక పాత అప్పుకు వడ్డీ కట్టాలంటే, మళ్లీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరకు వెళ్లి లేదా చైనా దగ్గరకు వెళ్లి ఇంకో కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఆ దేశం ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం విదేశీ అప్పు దాదాపు 130 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. వాళ్ల జీడీపీలో సగానికి పైగా ఆదాయం కేవలం అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. కరెంటు బిల్లులు సామాన్యులు తమ ఇళ్లలోని ఫ్యాన్లు, ఏసీలు అమ్ముకుని మరీ బిల్లులు కడుతున్నారు. పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి, విదేశీ కంపెనీలు పాకిస్థాన్‌ను వదిలి పారిపోతున్నాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితి పెట్టుకుని.. ఏకంగా అమెరికా, చైనా, ఇండియా, జపాన్, జర్మనీ లాంటి దేశాల సరసన 6వ స్థానంలో కూర్చుంటామని పాక్ ప్రధాని చెప్పడం హాస్యాస్పదమనే అభిప్రాయం అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుండి వ్యక్తమవుతోంది.



