అమెరికా కమాండర్లకు ఇరాన్ వార్నింగ్..!

అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య నడుస్తున్న పోరు ఇప్పుడు మానవత్వాన్ని మంటగలిపే స్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో జరిగిన ఒక ఘోర తప్పిదం.. ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలపై అమెరికా ప్రయోగించిన తొమహాక్ మిస్సైల్ దూసుకెళ్లడంతో.. ఏకంగా 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటనపై ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేదు. అగ్రరాజ్యం అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ పాఠశాలపై దాడి చేయాలని ఆదేశాలిచ్చిన అమెరికా యుద్ధనౌక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేఫ్రీ యీ యార్క్, కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్ టేట్ల ఫొటోలను సోషల్ మీడియాలో బహిరంగంగా రిలీజ్ చేసింది. ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకుని తీరుతాం అంటూ దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా బలగాలు భారీ వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా నేవీ నౌకల నుంచి తొమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఆ సమయంలో దురదృష్టవశాత్తు ఒక మిస్సైల్ ఇరాన్‌లోని మినాబ్‌లో కిక్కిరిసి ఉన్న ఒక పాఠశాల భవనంపై పడింది. ఆ పాఠశాల ప్రాంగణంలోనే ఐఆర్‌జీసీకి సంబంధించిన ఒక స్థావరం ఉందని అమెరికా మొదట వాదించింది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల తప్పుడు సమాచారంతోనే, కనీసం అక్కడ పసిపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అగ్రరాజ్యం ఈ దాడి చేసిందని అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఈ దాడిలో ఏకంగా 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల కాస్తా క్షణాల వ్యవధిలో స్మశాన వాటికగా మారిపోయింది. ఈ దారుణం ఇరాన్ ప్రజల గుండెల్లో చెరగని గాయంగా మిగిలిపోయింది.



