ఆ రేసులో ధురంధర్ లేదు…చరిత్ర సృష్టించిన తమిళ్ సాంగ్!

బాలీవుడ్ సంచలనం రణ్వీర్ సింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్పై థ్రిల్లర్ మూవీ ధురంధర్ . ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించడమే కాకుండా, మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా మ్యూజిక్ కు కచ్చితంగా ఆస్కార్ రేంజ్ లో ఉండే గ్రామీ అవార్డ్ వస్తుందని చిత్ర యూనిట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. అయితే తాజాగా గ్రామీ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ లో ధురంధర్ లేదు. మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏకంగా 9 కేటగిరీల్లో ఈ సినిమా పాటలను నామినేషన్స్ కోసం పంపితే, కనీసం ఒక్క కేటగిరీలో కూడా గ్రామీ జ్యూరీ ఈ సినిమాను షార్ట్ లిస్ట్ చేయలేదు. అక్టోబర్ నెలలో టీ-సిరీస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా ధురంధర్: ది రివెంజ్ ఆల్బమ్‌ను ఏకంగా 9 విభాగాల్లో గ్రామీ నామినేషన్ల కోసం పంపించాయి. విజువల్ మీడియా కోసం బెస్ట్ సాంగ్ గా ఫిర్ సే, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో జాన్ సే గుజర్తే హై, కన్హయ్.. బెస్ట్ ఏషియన్ పాప్ మ్యూజిక్ గా ఆరీ ఆరీ, అలాగే రాప్ పెర్ఫార్మెన్స్ కోసం డెస్టినీ-మన్ అట్క్యా, పాప్ డ్యుయో కోసం జాయియే సజనా, డ్యాన్స్ రికార్డింగ్ లో వారి జావా లాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ను ఎంతో నమ్మకంతో నామినేషన్ కు పంపింది ధురంధర్ టీమ్. అయితే లాస్ ఏంజెల్స్ లో ప్రకటించిన తుది నామినేషన్ జాబితాలో ధురంధర్ ఆల్బమ్ కు కనీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా స్థానం దక్కలేదు. కనీసం బెస్ట్ ఏషియన్ పాప్ కేటగిరీలో అయినా చోటు దొరుకుతుందని ఆశించిన మేకర్స్ కు గ్రామీ జ్యూరీ నిరాశే మిగిల్చింది.
ఇది సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. రణ్వీర్ సింగ్ అభిమానులు, బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ గ్రామీ కమిటీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ధురంధర్ కు నామినేషన్ దక్కలేదన్న బాధ ఒకవైపు ఉన్నా.. భారతదేశం గర్వించదగ్గ ఒక అద్భుతమైన వార్త అదే గ్రామీ నామినేషన్స్ నుంచి వచ్చింది. ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక తమిళ పాటకు గ్రామీ అవార్డ్స్ లో నామినేషన్ దక్కింది. దేవాన్ ఏకాంబరం , సుధా పాడిన వరువాయ్ అనే అద్భుతమైన తమిళ సాంగ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో ఫైనల్ నామినేషన్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. రూ.1300 కోట్లు వసూలు చేసిన సినిమా సాధించలేని ఫీట్ ను ఈ తమిళ పాట సాధించడం నిజంగా గ్రేట్ అని సంగీత ప్రియులు కొనియాడుతున్నారు.



