అమెరికాపై ఇరాన్ డర్టీ బాంబ్..వాషింగ్టన్ లో హై అలర్ట్..!

అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. కానీ అలాంటి దేశం రాజధానిలోనే ఇప్పుడు భయం నీడలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్, అమెరికా కూటమికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాన్.. ఇప్పుడు తన చూపును నేరుగా అమెరికా వైపే తిప్పుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఒక డర్టీ బాంబ్ బ్లాస్ట్ కు ఇరాన్ సన్నాహాలు చేస్తోందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా ఒక సంచలన నివేదికను బయటపెట్టాయి. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ట్రాక్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఇరాన్ భద్రతా బలగాలకు, ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు సంబంధించిన కొన్ని అత్యంత రహస్య సంభాషణలను అమెరికా గూఢచారులు ఇంటర్సెప్ట్ చేశారు. వాషింగ్టన్ డీసీలో ఒక భారీ దాడి చేయడానికి ఇరాన్ బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు ఆ నివేదికలో స్పష్టమైంది. సాధారణ బాంబుల కన్నా వందల రెట్లు ప్రమాదకరమైన డర్టీ బాంబుల ద్వారా దాడి చేసే వ్యూహాలను ఇరాన్ పరిశీలిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే ఈ బాంబులకు కావాల్సిన ముడిసరుకును అమెరికా లోపలికి స్మగ్లింగ్ ద్వారా చేర్చారా? లేక అక్కడే ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా స్థానికంగా ఏమైనా సేకరిస్తున్నారా? అనే కోణంలో FBI, CIA ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు దాడి జరిగే అవకాశం లేకపోయినా, భవిష్యత్తులో తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఇరాన్ ముందస్తుగానే ఈ కిల్లింగ్ ప్లాన్స్‌ను రచిస్తోందని అమెరికా భద్రతా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఈ డర్టీ బాంబ్ అంటే ఏంటి? అంటే ఇది ఒక రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైస్ . సింపుల్‌గా చెప్పాలంటే, డైనమైట్ లాంటి సాధారణ పేలుడు పదార్థాలకు అత్యంత ప్రమాదకరమైన రేడియోధార్మిక వ్యర్థాలను, పొడిని కలిపి ఈ బాంబును తయారు చేస్తారు. ఈ బాంబు పేలినప్పుడు అణుబాంబులాగా నగరాలు క్షణాల్లో బూడిద కావు. కానీ పేలుడు జరిగినప్పుడు అందులో ఉన్న రేడియోధార్మిక పదార్థాలు కొన్ని కిలోమీటర్ల మేర గాలిలో కలిసిపోతాయి. ఆ రేడియేషన్ గాలిని పీల్చిన వాళ్లకు వెంటనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. క్యాన్సర్లు బారిన పడతారు. క్రమక్రమంగా ప్రాణాలు కోల్పోతారు. లక్ష్యిత ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి, ఆ ప్రాంతాన్ని ఎన్నో ఏళ్ల పాటు నివాసయోగ్యం కాకుండా చేయడానికి ఉగ్రవాదులు వాడే ఆయుధం ఇది. ఇప్పుడు ఈ బాంబులతోనే అమెరికా రాజధానిని భయపెట్టాలని ఇరాన్ చూస్తోంది.ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో అత్యంత కీలకమైన పాయింట్.. టార్గెట్స్. ఇరాన్ ఎవరినో సామాన్యులను చంపాలని ఈ ప్లాన్ వేయడం లేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసిన అత్యున్నత స్థాయి అధికారులనే నేరుగా టార్గెట్ చేస్తోంది. దీని వెనుక ఒక బలమైన ప్రతీకార జ్వాల దాగి ఉంది. 2020 జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అమెరికా డ్రోన్ దాడి చేసి ఇరాన్ అత్యున్నత కమాండర్ ఖాసిం సోలేమానీ ని బగ్దాద్‌లో హతమార్చింది. దానికి ఇరాన్ ప్రతీకారంతో ఇంకా రగులుతూనే ఉంది. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అప్పట్లోనే బహిరంగంగా ప్రకటించారు. ఇక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చిన వెంటనే అమెరికా భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఉన్న భద్రత, పదవి దిగిపోయాక ఉండదు. అందుకే ఆ మాజీ అధికారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో, వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్న పలువురు ట్రంప్ హయాం నాటి సీనియర్ అధికారులకు అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతను అమాంతం పెంచేసింది. వాషింగ్టన్ డీసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. ఒకవేళ ఇరాన్ ఈ కుట్రను అమలు చేస్తే, అది అమెరికా గడ్డపై నేరుగా ఒక దేశం చేసిన ఉగ్ర దాడిగా పరిగణిస్తారు. అలా జరిగితే అమెరికా సైతం ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ముప్పును మొదట్లోనే కట్టడి చేయాలని ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. ఇరాన్ దౌత్యవేత్తల ద్వారా కూడా వైట్ హౌస్ పరోక్షంగా ఒక గట్టి వార్నింగ్ పంపినట్లు దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.



