అమెరికాలో ఆకాశంలో వింత ఆకారం..సోషల్ మీడియాలో భిన్న వాదనలు

భూమి మీద మనం మాత్రమే ఉన్నామా? లేక ఈ అనంత విశ్వంలో ఎక్కడో మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న గ్రహాంతరవాసులు ఉన్నారా? ఈ ప్రశ్న ఎన్నో ఏళ్లుగా మానవ మేధస్సును తొలిచేస్తోంది. అప్పుడప్పుడూ ఆకాశంలో వింత ఆకారాలు, ఫ్లైయింగ్ సాసర్స్ కనిపిస్తుంటాయి. కానీ, తాజాగా అమెరికాలోని ఓ అత్యంత భద్రత కలిగిన ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర కనిపించిన ఒక వింత ఆకారం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సముద్రంలో ఉండే జెల్లీఫిష్ ఆకారంలో, గాలిలో తనంతట తానుగా కదులుతూ వెళ్లిన ఈ UFO వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అలాస్కా రాష్ట్రం. జూన్ 15వ తేదీ రాత్రి సమయం. ఆకాశంలో ఏర్పడిన ఒక అద్భుతమైన ఇంద్రధనస్సును సరదాగా వీడియో తీసుకుందామని సారా జేన్ ఓస్బోర్న్ అనే మహిళ, ఆమె భర్త ప్రయత్నించారు. అప్పుడే వాళ్ల కెమెరా కంటికి ఒక భయంకరమైన, వింతైన ఆకారం చిక్కింది. దాదాపు 3 నిమిషాల పాటు ఆ జంటకు కనిపించిన ఈ ఆకారం.. ఉన్నట్లుండి ఒక్కసారిగా మాయమైపోయింది. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఘటన జరిగింది అమెరికాకు చెందిన జాయింట్ బేస్ ఎల్మెన్డార్ఫ్-రిచర్డ్సన్ అనే మిలిటరీ స్థావరం దగ్గర. ఇది అల్లాటప్పా బేస్ కాదు, ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ అయిన F-22 రాప్టర్ ఫైటర్ జెట్స్ కు, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సర్వైలెన్స్ కు ఒక ప్రధాన కేంద్రం. అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో రాడార్లకు కూడా దొరక్కుండా ఒక వింత ఆకారం చక్కర్లు కొట్టడం అమెరికా రక్షణ వ్యవస్ధనే షాక్ కు గురిచేసింది.
ఒక అత్యంత భద్రత కలిగిన మిలిటరీ స్థావరం దగ్గర ఇలాంటి సంఘటన జరగడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో ట్విట్టర్ లో ఒక అకౌంట్ నుంచి పోస్ట్ అవ్వగానే క్షణాల్లో లక్షల కొద్దీ వ్యూస్ తెచ్చుకుని వైరల్ గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇది కచ్చితంగా గ్రహాంతరవాసుల టెక్నాలజీ అని, వాళ్లు భూమి మీదకు వస్తున్నారని, మనల్ని గమనిస్తున్నారని భయపడుతుంటే.. మరికొందరు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ఎవరైనా ఎగరేసిన ఒక పెద్ద గాలిపటం లేదా గాలికి కొట్టుకొచ్చిన హీలియం బెలూన్ అయి ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. కానీ, ఆ వీడియో తీసిన జంట మాత్రం.. ఆ ఆకారం మాయమైపోగానే తాము అరగంట పాటు ఆ ప్రాంతం మొత్తం వెతికామని, చుట్టుపక్కల ఎవరూ గాలిపటం ఎగరేసిన ఆనవాళ్లు లేవని, అసలు అక్కడ ఏ మనిషీ లేడని అంటున్నారు. ఈ వీడియో చుట్టూ ఇప్పుడు ఎన్నో కాన్స్పిరసీ థియరీలు అల్లుకుంటున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఒక అడుగు ముందుకేసి.. ఇది గాలిపటం కాదు, అలాగని ఏలియన్స్ కూడా కాదు.. అమెరికా ప్రభుత్వం రహస్యంగా టెస్ట్ చేస్తున్న ఒక సీక్రెట్ డ్రోన్ లేదా అత్యాధునిక స్పై టెక్నాలజీ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో సామాన్య జనాలు ఎప్పుడైనా ఇలాంటి సీక్రెట్ ప్రయోగాలను చూసి UFOలు అనుకుంటే, తమ ప్రాజెక్టులను కవర్ చేసుకోవడానికి ప్రభుత్వాలే కావాలని ఇలాంటి గాలిపటం లేదా బెలూన్ ఆకారంలో ఉన్న వెపన్స్ ను డిజైన్ చేసి ఉంటాయని బలంగా వాదిస్తున్నారు. ఇలాంటి వీడియోలు వదిలి, ఏలియన్స్ అని భయపెట్టి ప్రజల టాక్స్ డబ్బులు వసూలు చేయడానికేనా? అని కొందరు నెటిజన్లు అమెరికా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఆకాశంలో ఎగిరిన ఆ వింత ఆకారం ఏంటన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అమెరికాకు UFOల గోల కొత్తేమీ కాదు. ప్రతి ఏడాదీ ఇలాంటి పదుల కొద్దీ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఏరియా 51 లాంటి ప్రదేశాలు ఇప్పటికే ఎన్నో రహస్యాలను దాచుకున్నాయి. పైగా సాక్షాత్తూ అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కూడా ఈమధ్య కాలంలో కొన్ని వీడియోలను అధికారికంగా రిలీజ్ చేసి, ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు ఎగురుతున్న మాట వాస్తవమే అని ఒప్పుకోవడం ఈ థియరీలకు మరింత బలాన్ని ఇస్తోంది.



