కివీస్ గడ్డపై టీమిండియా విశ్వరూపం.. 3-1తో వన్డే సిరీస్ మనదే!

ఫ్లాట్ పిచ్ లపైనే ప్రతాపం చూపిస్తారనే కొంతమంది విమర్శలకు చెక్ పెడుతూ న్యూజిలాండ్ వంటి బౌన్సీ పిచ్ లపై కూడా తిరుగులేని ఆటతీరుతో సత్తా చాటింది భారత్. మొన్న టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుని తాజాగా వన్డే సిరీస్ లో కూడా ఛాంపియన్ అంటే ఏంటో చూపించింది. అందులోనూ తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకుంటూ భారత్ ఆడిన తీరు భారత క్రికెట్ ఆధిపత్యం ఎలా ఉంటుందో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో ఈ ఆటతీరు చూసిన సగటు భారత క్రికెట్ అభిమాని సగర్వంగా తలెత్తుకునేలా చేసింది భారత్.
5 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించగా..మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక నాలుగో వన్డేలో భారత్ ఘోర పరాజయం చెందింది. అయితే ఓటమి నుండి తేరుకుని సిరీస్ లో కీలకమైన చివరి మ్యాచ్ లో సత్తా చాటింది.
బే ఓవర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 42.1ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్ (46), అక్సర్ పటేల్ (46), శ్రేయాస్ అయ్యర్ (22), నమన్ ధీర్ (22) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు, మ్యాథ్యూ ఫిషర్ 2 వికెట్లు,
బ్రైల్ టిక్నర్ 1 వికెట్, మైఖేల్ బ్రేస్ వెల్ 1 వికెట్ తీశారు. భారత్ తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకోవడంలో మాత్రం అదరగొట్టింది. న్యూజిలాండ్ ను 187 పరుగులకే పరిమితం చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డీన్ ఫాక్స్కర్ట్ (31), మిచెల్ శాంట్నర్ (24), నిక్ కెల్లీ (24), విల్ యంగ్ (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, అక్సర్ పటేల్ 2 వికెట్లు, అకిబ్ నబీ, నమన్ ధీర్, యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ లో 10 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి రెండు మేడిన్ ఓవర్లు 3 వికెట్లతో రాణించిన అర్ష్ దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ లో 9 వికెట్లతో రాణించిన గుర్నూర్ బ్రార్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లు దక్కాయి.



