తిలకం పెడితే తప్పేంటి..? లండన్ కోర్టులో హిందూ బాలుడి తండ్రి న్యాయపోరాటం!

PICTURE:imaginary pic generated by AI
బ్రిటన్లో ఇప్పుడు హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన ఒక అంశం తీవ్ర చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారింది. పాఠశాలకు వెళ్లే తొమ్మిదేళ్ల బాలుడు నుదుటిపై తిలకం ధరించకూడదని యాజమాన్యం ఆదేశించడం ఇప్పుడు ఏకంగా లండన్ హైకోర్టు గడప తొక్కింది. తమ కుమారుడిపై పాఠశాల యాజమాన్యం మతపరమైన వివక్ష, వేధింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ భారత సంతతి హిందూ కుటుంబం న్యాయపోరాటానికి దిగింది. తొమ్మిదేళ్ల బాలుడి తండ్రి తన కుమారుడి తరపున లండన్ హైకోర్టును ఆశ్రయించి, పాఠశాల నుంచి 25 వేల పౌండ్లు.. అంటే మన కరెన్సీలో సుమారు 30 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు .
ఈ వివాదం బ్రిటన్లోని ఆల్పర్టన్ ప్రాంతంలో ఉన్న వికర్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్లో చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల ఆ భారత సంతతి బాలుడు స్వామినారాయణ హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడు. ఆ సాంప్రదాయం ప్రకారం, ఆ బాలుడు గత నాలుగేళ్లుగా నుదుటిపై తిలకం ధరించే క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తున్నాడు. నాలుగేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం కలగలేదు. కానీ, 2025 నవంబరులో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని నుదుటిపై ఉన్న తిలకం గురించి ప్రశ్నించారు. ఇకపై పాఠశాలలో తిలకం ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. 2025 డిసెంబర్ 12న ఆ బాలుడిని పాఠశాల కౌన్సిల్ నుంచి కూడా తొలగించారు. ఈ పరిణామంతో ఆవేదన చెందిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యానికి లేఖ రాశారు. తమ కుమారుడు ఎన్నో ఏళ్లుగా తిలకం ధరించే పాఠశాలకు వస్తున్నాడని, ఇప్పటివరకు దానిపై ఎలాంటి నిషేధమూ లేదని వారు తమ లేఖలో స్పష్టంగా వివరించారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.



