రైతులకు మద్దతుగా తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..భారీ ఆధునిక సైలో కేంద్రాలు

దళారుల దోపిడీకి, రైతుల కన్నీళ్లకు శాశ్వత చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లో మంచి ధర వచ్చినప్పుడే విక్రయించుకునేలా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునికమైన సైలోల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా వరి కోతలు పూర్తయిన వెంటనే, పచ్చిగా ఉన్న ఆ తాజా ధాన్యంలో సుమారు 20 నుంచి 25 శాతం వరకు తేమ ఉంటుంది. ఈ తేమతో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం అసాధ్యం. అలా చేస్తే గింజకు బూజు పట్టి, మొలకలు వచ్చి మొత్తం పంట పాడైపోతుంది. ఈ తేమను 14 శాతం కంటే కిందకు తీసుకురావాలంటే రైతులు ఎండలో ఆరబెట్టాలి. కానీ వాతావరణం సహకరించక, రోడ్ల మీద ఆరబెట్టే సౌకర్యం లేక, అకస్మాత్తుగా వచ్చే వర్షాలకు తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిల్వ సమస్యల వల్ల, మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కోతలు పూర్తయిన 24 గంటల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన తక్షణ విక్రయ ఒత్తిడి రైతులపై పడుతోంది.
సరిగ్గా ఇక్కడే రైతు పడుతున్న ఈ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 20 ప్రాంతాల్లో భారీ ఆధునిక సైలో కేంద్రాలను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారం.. 25 శాతం తేమ ఉన్న ధాన్యానికి ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకు 3,500 నుంచి మహా అయితే 4,500 వరకు మాత్రమే ధర దక్కుతోంది. అంటే ఎకరాకు 30 వేలు పెట్టుబడి పెట్టి, రాత్రింబవళ్లు కష్టపడిన రైతుకు దక్కాల్సింది దక్కకపోగా, ఆ ధాన్యాన్ని కొని ఆరబెట్టుకుంటున్న మిల్లర్లు, దళారులు మాత్రం కోట్లల్లో లాభాలు గడిస్తున్నారు. దీన్ని నివారించి, పండించిన ప్రతి గింజకు పూర్తి విలువ రైతుకే దక్కేలా చేయడమే ఈ మోడరన్ సైలోల ప్రధాన ఉద్దేశం.ఇవి పూర్తిగా టెక్నాలజీతో, సెన్సార్లతో పనిచేసే భారీ స్టీల్ నిర్మాణాల హైటెక్ సెంటర్లు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఒక రైతు తన ధాన్యాన్ని కోయగానే నేరుగా ఈ సైలో కేంద్రానికి తీసుకురావచ్చు. ఇక్కడ అడుగుపెట్టగానే ఆటోమేటెడ్ డిజిటల్ మీటర్లతో వడ్లలో తేమను కచ్చితంగా పరీక్షిస్తారు. తర్వాత భారీ యంత్రాల ద్వారా చెత్తాచెదారం, మట్టి, రాళ్లు లేకుండా శుభ్రపరుస్తారు. ఆ తర్వాత వడ్లలో 25 శాతం తేమ ఉన్నా సరే, సైంటిఫిక్ పద్ధతుల్లో భారీ డ్రైయర్ మెషీన్ల ద్వారా ఆ వడ్లను కచ్చితమైన ఉష్ణోగ్రతతో నిమిషాల్లో ఆరబెడతారు . అప్పుడు వడ్లలోని తేమ శాతం సేఫ్ జోన్ అయిన 12 శాతానికి పడిపోతుంది.
ఆ తర్వాత ఆ నాణ్యమైన ధాన్యాన్ని ఎలుకలు, పురుగులు, పక్షులు పాడుచేయకుండా, బయట వాతావరణ మార్పుల ప్రభావం ఏమాత్రం పడకుండా ఏళ్ల తరబడి నిల్వ చేసుకునే అద్భుతమైన సౌకర్యం ఈ సైలోల్లో ఉంటుంది. ఇలా 12 శాతం తేమతో, నాణ్యత ఏమాత్రం తగ్గకుండా సైంటిఫిక్ పద్ధతిలో నిల్వ చేసిన ఈ ధాన్యానికి దేశీయంగానే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అలా ఆరబెట్టిన వడ్లకు క్వింటాకు కనీసం 5,000 నుంచి 5,500 వరకు కచ్చితమైన ధర లభించే అవకాశం ఉందని మంత్రి ప్రకటించారు. అంటే మార్కెట్లో రేటు తక్కువగా ఉన్నప్పుడు రైతు ఇక్కడ దాచుకుని, తనకు ఇష్టమైన రేటు వచ్చినప్పుడు తన ధాన్యాన్ని అమ్ముకునే స్వేచ్ఛ వస్తుందన్నమాట. దీనివల్ల రైతుకు దళారుల బెడద తప్పుతుంది. ఇంతటి గ్లోబల్ డిమాండ్ ఉన్న ఈ వరి రకాల నాణ్యతను కాపాడాలంటే, ఎగుమతి ప్రమాణాలకు తగ్గట్టుగా కచ్చితంగా మోడరన్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఈ 20 సైలోల వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ధాన్యం కొనుగోళ్ల సమయంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పై పడే వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్షరాలా వరి రైతులకు ఒక శాశ్వత భరోసాను, బంగారు భవిష్యత్తును ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే తొలి విడతలో 20 ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు ప్రభుత్వ స్థాయిలో కసరత్తు వేగంగా మొదలైంది. ఇందుకోసం రైతుల పొలాలకు, ప్రధాన మార్కెట్ లకు, అలాగే రవాణాకు అనువైన విశాలమైన స్థలాలను తక్షణమే గుర్తించాలని కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భారీ పెట్టుబడులు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆపరేటింగ్ మోడల్, ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన రెంటల్ గ్యారెంటీలపై ఆర్థిక, సాంకేతిక నిపుణులతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.



