నవంబర్ 27న మహా క్లాష్ మైసా VS భోగి గెలుపెవరిది?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో అత్యంత ఆసక్తికరమైన, హోరాహోరీ క్లాష్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి పోటీ మామూలుగా లేదు.. నవంబర్ 27న ఒకే రోజు నేషనల్ క్రష్ రష్మిక మందన్న మైసా , టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా భోగి థియేటర్లలో తలపడబోతున్నాయి. నిజానికి ఈ క్లాష్ ముందే ప్లాన్ చేసింది కాదు. సెన్సార్ కారణాలతో వాయిదా పడి, సరిగ్గా మైసా బరిలోకి దిగుతున్న నవంబర్ 27నే భోగీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. పూర్తిగా వేర్వేరు జోనర్లలో వస్తున్న ఈ రెండు సినిమాలు.. అటు రష్మికకు, ఇటు శర్వానంద్‌కు కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారాయి. రష్మిక మందన్నకు మైసా సినిమా కెరీర్ పరంగా చాలా కీలకం. గత రెండేళ్లలో ఆమె బాక్సాఫీస్ ప్రయాణాన్ని చూస్తే 2025 ఫిబ్రవరి లో రిలీజైన బాలీవుడ్ మూవీ ఛావా రష్మిక కెరీర్లో 600 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ధనుష్, నాగార్జునలతో కలిసి చేసిన కుబేర, ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘థామా’ సోలోగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, అవి ‘ఛావా’ స్థాయి సంచలనాన్ని మాత్రం సృష్టించలేకపోయాయి. ఇక ఈ ఏడాది విడుదలైన కాక్టెయిల్ 2 కేవలం యావరేజ్‌గా నిలవగా, విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రణబాలి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రష్మిక తన ఆశలన్నింటినీ మైసా పైనే పెట్టుకుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్.. ఒక గిరిజన యువతి పోరాటం, తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యంత భావోద్వేగంగా, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో రూపొందింది. ఈ సినిమాలో ఈశ్వరీ రావు, రావు రమేష్, గురు సోమసుందరం వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇక మరోవైపు, 2026వ సంవత్సరం హీరో శర్వానంద్ జాతకాన్నే పూర్తిగా మార్చేసిందిజ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన బైకర్ సినిమా కూడా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది. ఇప్పుడు రెండు వరుస విజయాల ఊపులో ఉన్న శర్వానంద్.. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పూర్తిస్థాయి మాస్ యాక్షన్ డ్రామా భోగి తో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, మాస్ బీట్స్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కేకే రాధామోహన్ ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను శర్వానంద్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవంబర్ 27న బాక్సాఫీస్ పోరు కేవలం మైసా , భోగి మధ్య మాత్రమే పరిమితం కావడం లేదు. అదే రోజు మరో రెండు ఆసక్తికరమైన చిత్రాలు కూడా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన హైందవతో పాటు విలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన చిత్రం నాన్న కుట్టి విడుదల కాబోతోంది. ఇలా ఒకే శుక్రవారం నాలుగు సినిమాలు థియేటర్లలో పోటీపడుతుండటంతో, నవంబర్ 27 బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించనుంది.



