సముద్రంలో భారత్ మహాశక్తి.. నేవీలోకి 8 పవర్ఫుల్ వార్‌షిప్స్!

మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో అగ్రరాజ్యాలన్నీ ఇప్పుడు సముద్ర జలాలపై పట్టు సాధించడం మీదే పూర్తి దృష్టి పెట్టాయి. ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక శాతం జరిగే హిందూ మహాసముద్రం.. ఇప్పుడు చైనా, భారత్ మధ్య ఒక పెద్ద కోల్డ్ వార్ కు వేదికగా మారింది. స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహంతో పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలోని హంబన్‌తోట పోర్ట్ లాంటి వాటిని చేజిక్కించుకుని చైనా నౌకాదళం భారత్‌ను చుట్టుముట్టే భయంకరమైన ప్రయత్నం చేస్తోంది. అయితే శత్రువుల ఆట కట్టించడానికి, హిందూ మహాసముద్రంలో పూర్తి ఆధిపత్యం సాధించడానికి భారత్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత నౌకాదళ బలాన్ని వంద రెట్లు పెంచడమే లక్ష్యంగా ఈ భారీ రక్షణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత్ కార్వెట్లతో నావికాదళాన్ని మరింత శక్తివంతం చేస్తోంది. పరిమాణంలో భారీ నౌకల కంటే కాస్త చిన్నవిగా ఉండి, అత్యంత వేగంగా ప్రయాణించే శక్తివంతమైన యుద్ధనౌకలు ఇవి. భారీ నౌకలు సులభంగా వెళ్లలేని సముద్ర తీరప్రాంతాల్లోకి ఇవి చాలా వేగంగా చొచ్చుకుపోతాయి. తీరప్రాంత రక్షణ, నిఘా, శత్రు నౌకల కదలికలపై నిరంతరం పహారా కాయడానికి వీటిని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నా.. తమ పరిమాణానికి మించిన ఎన్నో రకాల అత్యాధునిక క్షిపణులను, సెన్సార్లను మోసుకెళ్లగలవు. ఇప్పుడు మన నేవీ కోసం రూపుదిద్దుకోబోయే ఈ 8 కొత్త తరం కార్వెట్లు ఒక్కొక్కటి దాదాపు 2,000 టన్నుల బరువుతో నిర్మితమవుతాయి. గంటకు 30 నాట్ల అంటే సుమారు 55 కిలోమీటర్ల వేగంతో ఇవి అలలను చీల్చుకుంటూ సముద్రంలో దూసుకుపోగలవు.ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన, శత్రువులను వణికించే పదం స్టెల్త్ . ఇండియన్ నేవీ డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ సొంతంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ స్టెల్త్ డిజైన్ కారణంగా, ఈ 8 కార్వెట్లు అదృశ్య నౌకల్లా పనిచేస్తాయి. నౌక ఆకారాన్ని కోణీయంగా నిర్మించడం వల్ల, రాడార్ కిరణాలను గ్రహించే ప్రత్యేకమైన పెయింట్ వేయడం వల్ల ఈ నౌకలు శత్రువుల రాడార్ స్క్రీన్‌పై చాలా చిన్న చేపల పడవల్లాగా , పక్షుల్లాగా కనిపిస్తాయి. దీనివల్ల ఇవి శత్రువుల కళ్లుగప్పి వారికి అత్యంత సమీపంలోకి వెళ్లి మెరుపుదాడులు చేయగలవు.



