శత్రువును వణికించే ధురంధరులు.. ఎవరీ మౌంటెన్ ర్యాట్స్?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్కౌంటర్ తర్వాత, పూర్తి మిలిటరీ గేర్, ఏకే-203 రైఫిల్‌తో ఉన్న ఓ సైనిక కమాండో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గుబురు గడ్డం, క్యామోఫ్లాజ్ కోసం ఖాకీ వస్త్రం చుట్టిన ఏకే-203 రైఫిల్, టాక్టికల్ మిలిటరీ గేర్‌తో ఆయన కనిపించిన తీరు చూస్తేనే అర్థమవుతుంది.. ఆయన సాధారణ యూనిట్‌కు చెందిన సైనికుడు కాదని. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో పాల్గొనే కమాండోల భద్రత దృష్ట్యా, సైన్యం ఎప్పుడూ వారి పేర్లను, గుర్తింపును బయటపెట్టదు. కానీ, ఆ కమాండో డ్రెస్‌పై ఉన్న ప్రత్యేక బ్యాడ్జ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బ్యాడ్జ్ ఆధారంగా ఆయన భారత సైన్యంలోని ఎలైట్ యూనిట్ అయిన 9 పారా స్పెషల్ ఫోర్స్ కమాండో అని స్పష్టమవుతోంది. భారత సైన్యంలో ఈ ఫోర్స్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీళ్ల పనితీరు, వేగం, శత్రువును దెబ్బతీసే తీరును చూసి సైనిక వర్గాల్లో వీళ్లకు మూడు అద్భుతమైన నిక్‌నేమ్స్ పెట్టారు. అత్యంత సాహసోపేతంగా, ఊహించని రీతిలో శత్రు శిబిరాలపై విరుచుకుపడతారు అందుకే వీరిన పైరేట్స్ అని అంటారు. దెయ్యాల్లా నిశ్శబ్దంగా వచ్చి, శత్రువును తుదముట్టించి, ఆనవాలు కూడా లేకుండా మాయమైపోతారు..అందుకే వీరిని ఘోస్ట్ ఆపరేటర్స్ అని, మౌంటెన్ ర్యాట్స్ అని పిలుస్తారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం రాష్ట్రీయ రైఫిల్స్ తో కలిసి ఈ 9 పారా ఎస్ఎఫ్ కమాండోలు నిత్యం చురుగ్గా ఆపరేషన్లలో పాల్గొంటారు. కరుడుగట్టిన ఉగ్రవాదులను అంతం చేయడంలో వీళ్లకు తిరుగులేదు.
1965లో భారత్-పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్న సమయం. శత్రు భూభాగాల్లోకి రహస్యంగా చొచ్చుకెళ్లి, పాక్ సైన్యం ఊహించని విధంగా మెరుపు దాడులు చేయడానికి ఒక ప్రత్యేక దళం అవసరమని భారత సైన్యం భావించింది. సరిగ్గా అప్పుడే ధీర సైనికాధికారి కర్నల్ మేఘ్ సింగ్ ఒక ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీని శిక్షణ విషయంలో అత్యంత కఠినమైన, జాగ్రత్తతో కూడిన ప్రమాణాలను పాటించారు. కర్నల్ మేఘ్ సింగ్ పేరు మీదుగానే అప్పట్లో ఈ దళాన్ని మేఘ్‌దూత్ ఫోర్స్ అని పిలిచేవారు. 1965 యుద్ధంలో అత్యంత వ్యూహాత్మకమైన హాజీ పీర్ బల్జ్ వద్ద ఈ మేఘ్‌దూత్ ఫోర్స్ చేసిన మెరుపు దాడులు చరిత్రలో నిలిచిపోయాయి. వీళ్ల అద్భుతమైన పనితీరు చూసి ఆశ్చర్యపోయిన భారత సైన్యం, ఇదే దళంతో 1966 జులై 1వ తేదీన 9వ పారాచూట్ కమాండో బెటాలియన్ ను అధికారికంగా ఏర్పాటు చేసింది. భారత సైన్యంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్పెషల్ ఫోర్స్ ఇదే అని చెబుతారు. మినిమం మెన్.. మ్యాక్సిమమ్ ఇంపాక్ట్ తో సంచలనాలు సృష్టించింది. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ కేంద్రంగా పనిచేసే వీరు పర్వత యుద్ధ తంత్రంలో ప్రపంచంలోనే ధురంధరులు. అందుకే వీరికి మౌంటెన్ ర్యాట్స్ అనే పేరు స్థిరపడిపోయింది. పెద్ద సైన్యంతో కాకుండా చిన్న చిన్న దళాలుగా వెళ్లి శత్రువులకు భారీ నష్టం చేసి తిరిగి రావడం వీరి ప్రత్యేక శైలి. 1965 తర్వాత, 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో 9 పారా స్పెషల్ ఫోర్స్ మరో అసాధారణ సాహసం చేసింది. ఆ యుద్ధ సమయంలో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌పై పాకిస్థాన్ భారీ ఫిరంగులతో తీవ్రంగా దాడులు చేస్తోంది. ఆ ఫిరంగులను ఆపకపోతే భారత దళాలకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి. అప్పుడు రంగంలోకి దిగిన 9 పారా కమాండోలు అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ మంధోల్ చేపట్టారు. రాత్రికి రాత్రే శత్రువుల కళ్లుగప్పి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లారు. పాక్ సైన్యం ఏమాత్రం ఊహించని సమయంలో వారి ఆర్టిలరీ స్థావరంపై మెరుపు దాడి చేసి, పాకిస్థాన్ ఫిరంగులన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ ఒక్క ఆపరేషన్‌తో పూంచ్ సెక్టార్ రక్షణలో కీలక మలుపు వచ్చింది. వీళ్ల అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా 9 పారా ఎస్ఎఫ్కు డిఫెండర్ ఆఫ్ పూంచ్ అనే అత్యున్నత గౌరవం దక్కింది.



