తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా, నేడు ఆయన మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ను కలిశారు. స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అక్కడ మాజీ డిప్యూటీ సీఎం, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ఉన్నారు. వివిధ అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికార, ప్రతిపక్ష నేతలు ఇలా కలవడం సరికొత్త ఆహ్లాదకర సంప్రదాయానికి తెరతీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఆరోగ్యకరమైన పరిణామమని ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తామనే సానుకూల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందన్న అభిప్రాయం ప్రజల నుండి కూడా వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార, ప్రతిపక్షాలు కలవడం వలన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని భావిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సీఎం విజయ్ తీసుకునే ఈ చొరవను అభినందిస్తున్నారు. ఇలాంటి సంప్రదాయాలు ప్రజాస్వామ్య విలువలను మరింత పటిష్టం చేస్తాయంటున్నారు. ఇక విజయ్ నేతృత్వంలో తాజాగా ఏర్పాటైన ప్రభుత్వం మే 13న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. మరోవైపు నేడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడి దశాబ్దాల ద్రవిడ పార్టీలను పక్కకు పెట్టి ప్రజలు సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకేకు తమ మద్దతు తెలిపారు. విజయ్ పార్టీకి 108 సీట్లు వచ్చాయి. దీంతో ఇది తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది.