సోషల్ మీడియాకు ఏఐ కంటెంట్ కు సంబంధించి కీలక ఆదేశాలిచ్చిన కేంద్రం

Spread the love

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ విన్నా ఈ మాటే పరుగుల ప్రపంచంలో మరింత వేగంతో దూసుకుపోతోంది ప్రస్తుతం ఈ సాంకేతికత. మరోవైపు ఈ సాంకేతికతతో రూపొందిన కంటెంట్ సవాలుగా కూడా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంటెంట్ కు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని ఆదేశించింది. ఏఐ కంటెంట్ ను అందరు ఈజీగా గుర్తించే విధంగా లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లై చేసిన తరువాత లేబుల్ ను గానీ మెటా డేటాను తొలగించడానికి గానీ అలాగే కనబడకుండా చేసేందుకు వీలు లేకుండా ఉండాలని పేర్కొంది. ఇక చట్టవిరుద్ధమైన, అసభ్యమైన, మోసపూరిత ఏఐ కంటెంట్ ను నిరోధించేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఆటోమేటెడ్ సాధనాలు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. ఏఐ కంటెంట్ ను దుర్వినియోగం చేస్తే పడే ఫైన్లు, శిక్షల గురించి యూజర్స్ కు అవగాహన కల్పించేలా ప్రతి మూడునెలలకు ఒకసారి మెసేజ్ లు పంపించాలని సోషల్ మీడియాకు ఆదేశించింది. అలాగే సోషల్ మీడియా లకు మరో విషయాన్ని స్పష్టం చేసింది. ఏఐ జనరేటెడ్ లేదా డీప్ ఫేక్ కంటెంట్ ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశిస్తే దానిని మూడు గంటల్లో తొలగించే విధంగా లిమిట్ ను విధించింది.