ఐడెంటిటీ ఫ్రాడ్స్ ను అరికట్టేందుకు కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకు పైగా వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద నేడు పార్లమెంటుకు తెలిపారు. ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన క్లీన్ అప్ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్ సుమారు 134 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. చనిపోయిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేసి సంక్షేమ పథకాలను పొందడం, ఇతర మోసాలకు పాల్పడటం వంటివి నిరోధించడానికి ఈ డీయాక్టివేషన్ ప్రక్రియ చాలా కీలకమని పేర్కొన్నారు. ఆధార్ దుర్వినియోగాన్ని తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జితిన్ ప్రసాద తెలిపారు. ఇందులో భాగంగా వినియోగదారులు తమ బయోమెట్రిక్స్‌ను లాక్/అన్‌లాక్ చేసుకునే సదుపాయం, లావాదేవీల సమయంలో లబ్ధిదారు ఫిజికల్ గా ఉన్నట్లు నిర్ధారించే ‘లైవ్‌నెస్ డిటెక్షన్’ ఫీచర్‌తో కూడిన ఫేస్ అథెంటికేషన్, ఆధార్ సెక్యూర్ క్యూఆర్ కోడ్, ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ వంటివి అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. వినియోగదారుల ప్రధాన బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ యూఐడీఏఐ ఎవరితోనూ షేర్ చేసుకోదని, డేటాను ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో భద్రపరచడం తప్పనిసరి చేసిందని స్పష్టం చేశారు.