నెపోటిజం (బంధుప్రీతి)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని అభిప్రాయపడింది. హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టిన కోర్టు ఆ కేటాయింపులను రద్దు చేసింది. హర్యానా అర్బన్ హౌసింగ్ సొసైటీలో రెండు విలాసవంతమైన ఫ్లాట్ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందంటూ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించింది. బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం లాంటివి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ వైఖరి అసహ్యకరంగా ఉంటుందని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.