మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంపై రాహుల్ గాంధీ బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీ నేడు మరోసారి దీని ప్రస్తావన తీసుకొచ్చారు. ఈరోజు ఒకవేళ ప్రధానమంత్రి పార్లమెంటుకు వస్తే, నేను ఆయనకు ఒక పుస్తకాన్ని బహుకరిస్తానని రాహుల్ గాంధీ పార్లమెంట్ బయట మాట్లాడుతూ అన్నారు. ఈ పుస్తకం ఏ ప్రతిపక్ష నాయకుడిదో కాదు. ఇది ఏ విదేశీ రచయితదో కూడా కాదు. ఈ పుస్తకం దేశ మాజీ సైన్యాధిపతి జనరల్ నరవణే రాసింది – కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, క్యాబినెట్ మంత్రుల లెక్క ప్రకారం అసలు ఈ పుస్తకమే ఉనికిలో లేదని ఆక్షేపించారు. చైనా సైన్యం మన సరిహద్దుల్లోకి చొరబడినప్పుడు, అటువంటి క్లిష్ట సమయంలో సైన్యాధిపతిని నిరీక్షించేలా చేశారని ఈ పుస్తకంలో స్పష్టంగా రాసి ఉందని పేర్కొన్నారు. మరియు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, ప్రధానమంత్రి కేవలం “మీకు ఏది సరైనది అనిపిస్తే అది చేయండి” — అని మాత్రమే చెప్పారని రాహుల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంటే దేశ భద్రతకు సంబంధించి అత్యంత తీవ్రమైన సంక్షోభం ఎదురైనప్పుడు, మోదీ తన రాజకీయ బాధ్యత నుండి చేతులెత్తేశారు. రాజకీయ నాయకత్వం సైన్యాన్ని ఒంటరిగా వదిలేసిందని ఆ సమయంలో తనకు అనిపించిందని జనరల్ నరవణే స్వయంగా రాశారని తెలిపారు. పార్లమెంటులో నేను ఏ నిజం చెప్పకుండా నన్ను అడ్డుకుంటున్నారో, ఆ నిజం ఇదే. దేశం ప్రశ్నిస్తోంది, కానీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని రాహుల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.