అనర్హత పిటిషన్లను స్పీకర్ గారు వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు:కె.టి.ఆర్ 

Spread the love

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గారు వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ విమర్శించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను తిరస్కరించడం అర్థరహితమని దుయ్యబట్టారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా సీఎం  ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆక్షేపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్స్ అంటే  భయపడుతోందని అర్థమైపోయిందని సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సీఎం  వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ ప్రభుత్వం వణికిపోతోందని తేలిపోయిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదన్నారు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం  నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదని రాసుకొచ్చారు.