ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతర రెండవ రోజు అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ జాతరకు విచ్చేసిన సందర్భంగా వారికి తెలంగాణ మంత్రులు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ (సీతక్క) , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కుంభ మేళాను తలపించే విధంగా సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. భక్తుల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రులకు గుర్తు చేశారు. ప్రధానితో చర్చించి జాతీయ పండుగగా గుర్తింపు అందించాలని కోరారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మేడారం జాతర అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్రమంత్రులు తెలిపారు. మేడారం మహా జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోవాలని వారు పేర్కొన్నారు. జాతరలో ఏర్పాట్లని కొనియాడారు. ఈ సందర్భంగా ఆదివాసి, గిరిజన, మేడారం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులను సత్కరించి చేసి, జ్ఞాపికలను అందించారు.