వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్ర సీఎంను ఆయన తండ్రిగారిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఈ సమాజం హర్షించని వ్యాఖ్యలు, సభ్యసమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబుకి, వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంబటి చేసిన తీవ్ర వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయి… నేడు ఆ విషయాన్ని ప్రక్కదారి పట్టించే కుట్రలో భాగంగా…సీఎం గురించి ఇలాంటి తప్పుడు కూతలు కూయడం తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. అంబటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా దానికి అంబటి రాంబాబు, తన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వాస్తవాలు చెప్పిన చంద్రబాబు గారి నోటిని ఫినాయిల్ తో కడగాలని దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి, రోజా, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి, జోగి రమేష్ లాంటి వారు… నేడు అంబటి చేసిన వ్యాఖ్యలను బట్టి అతని నోరు యాసిడ్ తో కడగాలా? ఫినాయిల్ తో కడగాలా? మరి దేనితోనైనా కడగాలా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మరొకరు సీఎం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా, సమాజాన్ని అపఖ్యాతిపాలు చేసే పరిస్థితి తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.