ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. ముఖ్యంగా సేంద్రీయ సాగుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సాగులో రసాయనాల వినియోగాన్ని 2.28 శాతం తగ్గించిన నేపథ్యంలో, PM-PRANAM పథకం కింద రూ. 216 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేయాలని కోరారు. అలాగే, రాష్ట్రంలో కొబ్బరి సాగు అభివృద్ధికి రూ. 200 కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్లు, కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు ద్వారా 15 వేల మందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. వీటితో పాటు ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ స్కీంకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 695 కోట్లు, తోతాపూరి మామిడి రైతులకు కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ. 100 కోట్లను విడుదల చేయాలని కోరారు. కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూలత ఉన్నందున, ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.