కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి,నూతన మార్గాల ఏర్పాటుపై సమగ్రమైన విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఈసారి బడ్జెట్‌లో ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ మీదుగా వెళ్తుండటంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరు-చెన్నై కారిడార్‌ను తిరుపతికి అనుసంధానం చేయాలని కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, తాడిపత్రి నుండి ముంబై పోర్టుకు అరటి ఎగుమతుల కోసం రీఫర్ కంటైనర్లపై 50 శాతం రాయితీ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని, ఇటార్సీ-విజయవాడ మరియు ఖరగ్ పూర్-చెన్నై మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను నిర్మించాలని కోరారు. విశాఖ-విజయవాడ మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లతో పాటు, హైదరాబాద్-శ్రీశైలం-మార్కాపురం కొత్త లైన్ ద్వారా ఆధ్యాత్మిక అనుసంధానాన్ని పెంచాలని సూచించారు. వీటితో పాటు తిరుపతి మీదుగా విజయవాడ-బెంగళూరు వందేభారత్ సర్వీసును ప్రారంభించాలని, కుప్పం రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వడంతో పాటు అక్కడ రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు.