ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ కు సన్నిహితుడుగా మెలిగిన విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం చర్చనీయాంశమైంది. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు గతంలో విజయసాయిరెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఇక మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని, ఆ డబ్బును హవాలా ద్వారా ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు తరలించినట్లు అభియోగాలున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.