ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వై.ఎస్.జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబుపై పలు ఆరోపణలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ గతంలో రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టునూ పూర్తిగా వాడుకోలేని పరిస్థితులు ఉండేవి. 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీళ్లు నింపలేకపోయాడు. మేం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని సరిదిద్దాం. తెలుగు గంగ లింక్ కెనాల్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, అవుకు టన్నెల్, గండికోట రిజర్వాయర్, చిత్రావతి, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు, పులిచింతల ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించి, ఫుల్ కెపాసిటీతో వినియోగంలోకి తెచ్చాం. NGT అభ్యంతరాల తర్వాత కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) మూడుసార్లు సమావేశమైతే రాష్ట్రం తరఫున చంద్రబాబు కనీసం నోరు మెదపలేదని ఆక్షేపించారు. చంద్రబాబు ఆయన మంత్రి కలిసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్కర్లేదని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కట్టకపోతే కుప్పానికే కాదు చిత్తూరు జిల్లాకు తాగునీళ్లు ఉండవని చంద్రబాబుకు తాను పుట్టిన చిత్తూరు జిల్లామీద మమకారం లేదు, ఓట్లేసి గెలిపించిన కుప్పం ప్రజల పట్ల కృతజ్ఞతా లేదని అన్నారు. ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీకి పాల్పడ్డాని ఆరోపించారు. . ముందు 15,000 ఎకరాలు కావాలని, తర్వాత 5,000 ఎకరాలని అనడంతో ప్రజలు అనుమానించారు. భూసేకరణకు వ్యతిరేకంగా 130 కేసులు వేశారు. మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును 2,200 ఎకరాలు ఎయిర్ పోర్ట్ కు, 500 ఎకరాలు ఎయిరోసిటీకి కుదించామని జగన్ స్పష్టం చేశారు. కోర్టు కేసులు పరిష్కరించి దాదాపు రూ.960 కోట్లతో భూసేకరణ పూర్తి చేసి, 3 గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించి వారికి కాలనీ కట్టి, NOC సాధించి, అన్ని అనుమతులూ తెచ్చి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చంద్రబాబు, ఆయనకున్న మీడియా, డజన్లకొద్దీ ఉన్న అబద్ధాల ఫ్యాక్టరీలతో మా హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయని నిరంతరం టన్నుల కొద్దీ బురద జల్లాడని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాలను బద్దలు చేస్తూ ఆర్బీఐ డిసెంబర్ లో ఒక నివేదిక ఇచ్చిందని దానిప్రకారం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక రంగం వృద్ధి రేటు దేశంలోనే ఏపీ 5వ స్థానంలో, దక్షిణ భారతంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. నిజానికి చంద్రబాబు హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతున్నారని సజ్జన్ జిందాల్, అరబిందో, మైహోమ్, శ్రీసిమెంట్స్, రాంకో, దాల్మియా, యూబీ, షిర్డీసాయి వంటి పరిశ్రమలన్నీ చంద్రబాబు వల్ల భయభ్రాంతులకు గురై రాష్ట్రం నుండి వెళ్లిపోయారన్నారు. పరిశ్రమల పేరుతో చంద్రబాబు స్కాములు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పేరుకు ఒకటి రెండు పెద్ద కంపెనీలకు భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టేస్తాడు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆక్షన్ లేకుండా ఎకరా రూ.50కోట్లు విలువ చేసే భూములను కేవలం కోటిన్నరకు ఇచ్చేశాడు. రహేజా సంస్థకైతే 99పైసలకే ఇచ్చేశారన్నారు.