ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని గ్రామాల అభివృద్ధిలో భాగంగా తుళ్లూరు మండలం నేలపాడు, మల్కాపురాల్లో నిర్వహించిన గ్రామసభలకు ఆయన హాజరయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇంటింటికి తాగునీటి పైపులైన్లు, వీధిలైట్లు, 24 గంటల డ్రింకింగ్ వాటర్ సరఫరా, డ్రైనేజీ వర్క్స్ చేపడుతున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో రాబోయే ఆరు నెలల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. 2058 నాటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్లుగా ప్రణాళికలు రూపొందించామన్నారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామస్థులు అడిగినవన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.