మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటనపై ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య వైయస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని ఏ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం. ఆపై హత్య.తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం. ఆపై హత్య. చంద్రబాబుగారూ.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన ఘటనలు జరిగినా, వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం. ఎల్లోమీడియాను వాడుకుని హడావిడి ప్రకటనలు చేయడం ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం.. మీకు రొటీన్ అయిపోయిందంటూ విమర్శించారు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయిన వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై లేదని మండిపడ్డారు.
మీ ప్రభుత్వంలో హోంమంత్రిగారు లా అండ్ ఆర్డర్‌కు బాధ్యత వహించరు, మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ, అందరి శాఖల్లో వేలుపెడతాడు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరు. ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని.. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు? అని ప్రశ్నించారు. మీరు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్‌తో, రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? అని దుయ్యబట్టారు.
పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి, అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారని ఆక్షేపించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒక టీడీపీ నాయకడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే, కేసు కట్టి, అరెస్టు చేయాల్సిన పోలీసులు, 3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి, జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరి ఇక రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా మేలుకోవాలని తక్షణం లా అండ్ ఆర్డర్‌పైన, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించడంపైన, వారి ప్రాణాలు కాపాడడంపైన దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.