అల్లు స్నేహారెడ్డి కొత్త ప్రయాణం.. బౌలీ ఆర్ట్ సంఘానికి కల్చర్ అండ్ హెరిటేజ్ చైర్ పర్సన్ గా బాధ్యతలు

అల్లు స్నేహారెడ్డి ఒక టాప్ స్టార్ సతీమణిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలే. తాజాగా ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక అద్భుతమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ఆమె బౌలీ ఆర్ట్ సంఘం కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగానికి చైర్ పర్సన్‌గా నియమితురాలయ్యారు. ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెబుతూ ఆమె ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి మెట్లబావుల కళా ద్వివార్షికోత్సవమైన బౌలీ ఆర్ట్ సంఘానికి కల్చర్ అండ్ హెరిటేజ్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని స్నేహారెడ్డి తెలిపింది. ఒక స్టార్ హీరో భార్యగా ఉన్న పలుకుబడిని సమాజానికి, సంస్కృతికి ఉపయోగపడేలా ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు ఈ బౌలీ ఆర్ట్ సంఘం అంటే వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో తాగునీటి కోసం, వ్యవసాయం కోసం రాజులు, నవాబులు అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో మెట్ల బావులను నిర్మించారు. కానీ కాలక్రమంలో అవి చెత్తాచెదారంతో కనుమరుగైపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, కొన్ని ఎన్జీవోల సహకారంతో వాటిని మళ్లీ పునరుద్ధరించింది. ఈ పురాతన మెట్ల బావుల వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఉత్సవమే ఈ బౌలీ ఆర్ట్ సంఘం. అధికారిక వెబ్సైట్ సమాచారం ప్రకారం.. ఈ అద్భుతమైన ఉత్సవం ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి వచ్చే ఏడాది 2027 జనవరి 10 వరకు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఏకంగా 40 రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి హైదరాబాద్‌లోని 13 కు పైగా చారిత్రక మెట్ల బావులు, వారసత్వ ప్రదేశాలు వేదిక కానున్నాయి. భారతదేశం నలుమూలల నుంచి దాదాపు 200 మందికి పైగా కళాకారులు ఈ చారిత్రక కట్టడాల వద్ద తమ కళను, నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడానికి ఇది ఒక మంచి వేదిక కాబోతోంది.
ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఈవెంట్‌లా కాకుండా, భవిష్యత్ తరాలకు ఒక పాఠంలా మార్చాలన్నదే ఆమె ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా నేటి యువతరంలో హైదరాబాద్ నగర చరిత్ర, ఇక్కడి సంస్కృతి, మెట్ల బావుల వారసత్వం పట్ల లోతైన అవగాహనను, ఆసక్తిని పెంపొందించడం స్నేహారెడ్డి ప్రధాన బాధ్యత. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆమెకు ఉన్న మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ద్వారా ఈ వారసత్వ కట్టడాల గొప్పదనాన్ని యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రమోట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగమై ముఖ్యంగా యువతరంలో చరిత్ర పట్ల అవగాహన పెంపొందించడంలో తాను సహాయపడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు తెలిపారు.
మన కళ్లముందే శిథిలావస్థకు చేరుకుంటున్న చరిత్రను బతికించాలన్న ఈ వినూత్న కార్యక్రమానికి బీజం వేసింది ఇద్దరు అద్భుతమైన మహిళలు. ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ స్థాపకురాలైన కల్పనా రమేష్, ఏక్ చిత్ర స్థాపకురాలైన అన్నపూర్ణ మడిపడిగ , కళను ,సంస్కృతిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ సంయుక్తంగా ప్రారంభించిన ఈ బౌలీ ఆర్ట్ సంఘం ప్రాజెక్టుకే ఇప్పుడు అల్లు స్నేహారెడ్డి బ్రాండ్ అంబాసిడర్లా, చైర్ పర్సన్‌గా తోడయ్యారు.



