వివాదంలో కరీనా కపూర్ మెడలోని 200 ఏళ్ల నాటి పచ్చల హారం.. అసలు ఆ లాకెట్ లో ఏముంది?

ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో కరీనా కపూర్ ఒక అద్భుతమైన ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. ఆ ఫొటోలు ఇంటర్నెట్లో క్షణాల్లో వైరల్ అయ్యాయి. కానీ, ఆ ఫొటోలే ఇప్పుడు ఆమె మెడకు ఒక పెద్ద లీగల్ ఉచ్చు బిగించాయి. దీపావళి పండగ రోజు కరీనా కపూర్ తన మెడలో ధరించిన ఒక భారీ పచ్చల హారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద మత వివాదానికి దారితీసింది. ఆ లాకెట్ మీద పవిత్ర ఖురాన్‌లోని వచనాలు చెక్కి ఉండటంతో ఒక వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏకంగా ఆమెకు, ఆమె స్టైలిస్ట్‌కు ఒక లీగల్ నోటీసు కూడా పంపించారు. వెంటనే ఆమె పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని, ఆ ఫొటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ డిజైనర్ పునీత్ బలానా డిజైన్ చేసిన ప్యూర్ సిల్వర్ కాఫ్తాన్ , దానికి మ్యాచింగ్ తలపాగాలో కరీనా ఎంతో రాయల్‌గా కనిపించింది. ఆమె లుక్‌ను డిజైన్ చేసిన ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ , తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఆభరణాల గురించి ఒక పోస్ట్ పెట్టడంతోనే ఈ వివాదం మొదలైంది. ఇది నిజమైన రాయల్ స్టైల్. కరీనా ధరించిన ఈ ఆభరణాలు సుమారు 200 ఏళ్ల నాటివి. ఆమె తలకు పెట్టుకున్న కల్గీ , భోపాల్ నవాబుల కాలం నాటిది. ఇక ఆమె మెడలో ఉన్నది 30 క్యారెట్ల పచ్చల లాకెట్ . ఇది భోపాల్ బేగంకు చెందినది, ఆ పచ్చ మీద ఆయత్-ఉల్-కుర్సీ చెక్కి ఉంది అని రాసుకొచ్చారు. ఇవి మార్కెట్లో కొన్నవి కావు, ఇవన్నీ సైఫ్ అలీ ఖాన్ కుటుంబం నుంచి వచ్చిన వారసత్వ సంపద . సైఫ్ నాయనమ్మ, అంటే భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కూతురు సాజిదా సుల్తాన్‌కు చెందిన ఆస్తులివి అని చెప్పుకొచ్చింది..ఇక ఆ పోస్ట్‌లో ఖురాన్ వచనాలు అన్న పదం చూడగానే ఈ వివాదం రాజుకుంది.



