ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-జపాన్ కీలక రక్షణ సహకారం…2+2 చర్చలు మరియు ఒప్పందాలు

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ దేశం చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్, జపాన్ దేశాలు చేతులు కలిపాయి. రక్షణ రంగంలో ఇప్పటికే బలంగా ఉన్న తమ స్నేహ బంధాన్ని ఇరు దేశాలు ఇప్పుడు మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. జపాన్‌లో జరిగిన అత్యంత కీలకమైన 2+2 రక్షణ , విదేశాంగ మంత్రుల సమావేశంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, జపాన్ సైన్యం చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత ఫైరింగ్ రేంజ్‌లలో తమ సర్ఫేస్-టు-షిప్ మిస్సైళ్లతో లైవ్ ఫైరింగ్ ట్రైనింగ్ నిర్వహించబోతోంది.
భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఇంత వేగంగా దగ్గరవడానికి ప్రధాన కారణం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెంచుకుంటున్న సైనిక ఆధిపత్యమే. అదే ఈ రెండు దేశాలను ఒకే తాటిపైకి తెచ్చింది. రెండు దేశాలకూ శత్రువు ఒక్కరే, ముప్పు కూడా దాదాపు ఒకేలా ఉంది. ఒకవైపు భూభాగ సరిహద్దుల్లో చైనా భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తూర్పు చైనా సముద్రంలో జపాన్‌కు అదే డ్రాగన్ దేశం నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. సముద్ర జలాల్లో తన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్న చైనాకు, ఈ రెండు బలమైన ఆసియా ప్రజాస్వామ్య దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం ఒక గట్టి హెచ్చరిక లాంటిది. ముఖ్యంగా ఉపరితలం నుంచి యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సర్ఫేస్-టు-షిప్ మిస్సైళ్ల శిక్షణ భారత్ లో జరగడం అనేది.. సముద్రంలో దూకుడు చూపే దేశాలకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. అలాగే రానున్న రోజుల్లో అవసరమైన కీలక డిఫెన్స్ టెక్నాలజీ బదిలీపైనా ఇరు దేశాలు భారీ ఒప్పందం చేసుకున్నాయి. డిజైన్ విత్ జపాన్, మేక్ ఇన్ ఇండియా అనే సరికొత్త నినాదం కింద యుద్ధ నౌకల కోసం అత్యంత కీలకమైన యూనికార్న్ స్టెల్త్ నావల్ మాస్ట్ సిస్టమ్ ను భారత్, జపాన్ సంయుక్తంగా తయారు చేయనున్నాయి.
సాధారణంగా యుద్ధ నౌకలపై ఉండే యాంటెన్నాలు, రాడార్లు శత్రువుల కంట పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యూనికార్న్ స్టెల్త్ మాస్ట్ టెక్నాలజీ ద్వారా, ఆ యాంటెన్నాలన్నింటినీ ఒకే అధునాతన కవచంలో అమరుస్తారు. దీనివల్ల యుద్ధ నౌకలు శత్రు రాడార్లకు చిక్కకుండా రహస్యంగా కదిలే స్టెల్త్ సామర్థ్యం భారీగా పెరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా అత్యంత అధునాతనమైన జపనీస్ టెక్నాలజీ నేరుగా భారత్‌కు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, ఇరు దేశాల నేవీ , ఎయిర్ ఫోర్స్ సంయుక్త విన్యాసాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
ఈ సమావేశంలో కేవలం చైనా అంశమే కాకుండా, భారతదేశం దశాబ్దాలుగా పోరాడుతున్న సీమాంతర ఉగ్రవాదం విషయంలోనూ జపాన్ పూర్తి మద్దతు ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తూ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్, జపాన్ ఉమ్మడిగా డిమాండ్ చేశాయి. ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేశాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల విషయంలోనూ ఇరు దేశాలు తమ ఐక్యతను చాటుకున్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్, జపాన్ రెండూ కూడా ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నాయి. తాజా భేటీలో యూఎన్ఎస్సీ సంస్కరణలు, శాశ్వత సభ్యత్వం విషయంలో ఒకరికొకరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల ఈ పరస్పర సహకారం రాబోయే రోజుల్లో ఇండో-పసిఫిక్ రీజియన్ లోని భద్రతను మరింత పటిష్టం చేయబోతోంది.



