ఇరాన్‌పై యుద్ధానికి ఇజ్రాయిల్ రెడీ.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

ఇరాన్‌తో మరోసారి ప్రత్యక్ష యుద్ధం తప్పదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేస్తుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. కేవలం మాటలే కాదు.. ఇరాన్‌పై నాలుగు నుంచి ఏడు రోజుల పాటు నిరంతరాయంగా భీకర వైమానిక దాడులు నిర్వహించేందుకు అమెరికా మద్దతు కూడగట్టే పనిలో నెతన్యాహూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఇజ్రాయిల్ సైన్యం అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు ఇప్పటికే దాడులకు సంబంధించిన ప్లాన్‌ను పంచుకుని, ఆమోదించారన్న వార్తలు పశ్చిమాసియాలో హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ యుద్ధానికి రెడీ అంటూ ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్‌పై దాడి విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారని అందులోనూ తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన ఆ ఒక్క కామెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ ఆలోచనలో పడేసింది.ఇజ్రాయిల్ మీడియా వెల్లడించిన సంచలన కథనాల ప్రకారం ఇటీవల ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తమ దేశ సీనియర్ మంత్రులు, అత్యున్నత భద్రతా అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ అత్యంత కీలక భేటీల్లో ఇరాన్ ముప్పుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశాల్లో నెతన్యాహూ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఇరాన్ వంటి పెద్ద దేశంపై వరుసగా రోజుల తరబడి వైమానిక దాడులు చేయాలంటే అమెరికా సహకారం తప్పనిసరి అందుకే అమెరికా మద్దతు కూడగట్టే తీవ్ర ప్రయత్నాల్లో నెతన్యాహూ నిమగ్నమయ్యారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇది కేవలం నెతన్యాహూ మనసులో ఉన్న ఆలోచన మాత్రమే కాదు, ఇప్పటికే దీనికి సంబంధించిన సైనిక ప్రణాళికలు కూడా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ రక్షణ దళాలకు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇజ్రాయిల్ , అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు ఇరాన్‌పై దాడులకు సంబంధించిన కీలక ప్లాన్‌ను ఇప్పటికే పరస్పరం పంచుకున్నట్లు, అంతేకాదు ఆ ప్లాన్‌ను ఆమోదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌పై ఏదో ఒక్కరోజు మెరుపు దాడితో సరిపెట్టుకోకుండా, కనీసం నాలుగు నుంచి ఏడు రోజుల పాటు నిరంతర వైమానిక దాడులు నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నెతన్యాహూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ సైనిక, క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయాలంటే ఈ నాలుగు నుంచి ఏడు రోజుల ఆపరేషన్ తప్పనిసరి అని ఇజ్రాయిల్ భావిస్తోంది. ఇక ట్రంప్ మాత్రం ఇరాన్‌పై మరోసారి దాడి చేసే విషయంలో అత్యంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయిల్ ఒత్తిడికి తలొగ్గి తక్షణమే యుద్ధంలోకి దిగేందుకు ట్రంప్ సిద్ధంగా లేరన్న విషయం ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన మనసులోని మాటను సూటిగా చెప్పారు. ఇరాన్‌పై తదుపరి నిర్ణయం తీసుకోవడానికి తాను ఏమాత్రం తొందరపడటం లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని తేల్చి చెప్పారు. ఒకవైపు గల్ఫ్ స్థావరాల భద్రత, మరోవైపు ప్రపంచ ఇంధన సరఫరా, ఇంకోవైపు అమెరికా సైనిక నిల్వలు, అంతర్జాతీయ దౌత్య సమీకరణాలన్నింటినీ బేరీజు వేసుకున్నాకే ట్రంప్ తదుపరి అడుగు వేయాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంటే, ఈ ఏడాది ముగిసేలోపు ఇరాన్‌పై హడావిడిగా భారీ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ట్రంప్ లేరు.. అయితే, నెతన్యాహూ ఒత్తిడికి తలొగ్గి కొత్త ఏడాదిలో ట్రంప్ ఈ భారీ వైమానిక దాడులకు అంగీకరిస్తారా? లేక దౌత్య మార్గాల ద్వారా ఇరాన్‌కు చెక్ పెడతారా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఉత్కంఠగా మారింది.



