ఎన్టీఆర్ జిల్లాలో పులి..రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్..అధికారుల హై అలర్ట్..!

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రైతులు, పశువుల కాపరులు బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం , అటవీ , పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే రంగంలోకి దిగారు. ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచారంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, ప్రజల భద్రతకు భరోసా ఇచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. కేవలం సాధారణ గస్తీ మాత్రమే కాదు.. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు భారీ హైటెక్ ఆపరేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంతేకాదు, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలను రప్పించాలని సూచించారు. ఈ సందర్భంగా పులి కదలికలను కచ్చితంగా ట్రాక్ చేసేందుకు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ టెక్నాలజీని విస్తృతంగా వాడాలని ఆదేశించారు. పులి కదలికలను మరింత సమర్థవంతంగా గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లు , ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను విస్తృతంగా వినియోగించాలని తెలిపారు. స్థానిక అటవీ శాఖ బృందాలతో సమన్వయం చేసుకుంటూ హనుమాన్ బృందాలతో ఆ ప్రాంతంలో విస్తృతంగా గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, దాని సంచార మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. ఆ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలకు వెంటనే చేరవేయాలని స్పష్టం చేశారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ , ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులు నిరంతరం స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో చేపట్టే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.
అలాగే సమీప గ్రామాల ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పులి సంచరిస్తున్న ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో ఉన్న రైతులు, పశువుల కాపరులు, స్థానిక ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలు ఎవరూ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అవసరమైన ముందస్తు సూచనలు, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎలాంటి జాప్యం జరగకుండా, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక పులి ట్రాకింగ్ , రెస్క్యూ బృందాలను రప్పించి ఆపరేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్స్‌ను తూచ తప్పకుండా పాటిస్తూ.. అనుభవజ్ఞులైన వన్యప్రాణి నిపుణుల సహకారంతో పులిని సురక్షితంగా బంధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో ప్రజలకుగానీ, పులికిగానీ ఎలాంటి హాని కలగకూడదని ఆయన తేల్చి చెప్పారు. ఒకవైపు ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, మరోవైపు వన్యప్రాణి అయిన పులి సంరక్షణను కూడా తమ బాధ్యతగా తీసుకుని అత్యంత జాగ్రత్తగా, సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. థర్మల్ డ్రోన్లు, ఏఐ కెమెరా ట్రాప్‌లు, హనుమాన్ బృందాల గస్తీ, నాలుగు ప్రభుత్వ శాఖల సమన్వయం, అవసరమైతే ఇతర రాష్ట్రాల నిపుణుల సహకారం.. ఇలా అన్ని విధాలా ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులిని సురక్షితంగా పట్టుకుని, ప్రజలకు భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కా కార్యాచరణను అమల్లోకి తెచ్చారు.



