ఒకేసారి రూ.6 వేలు జంప్..రికార్డు సృష్టిస్తున్న పసుపు ధర

ఒకప్పుడు పసుపు పండించిన రైతులు సరైన గిట్టుబాటు ధర లేక, దళారుల చేతిలో మోసపోయి రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజులు మనం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పసుపు నిజంగానే పసిడి పంటగా మారి రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. తాజాగా మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపునకు కళ్లు చెదిరే స్థాయిలో రికార్డు ధర నమోదైంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే క్వింటా పసుపు ధర ఏకంగా 6,000 పైగా జంప్ అవ్వడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నామ్ విధానంలో పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో.. కాడి , గోళ రకం పసుపు మంచి ధర పలికింది.
మహబుబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పసుపు క్రయవిక్రయాలకు పెట్టింది పేరు. ఇటీవలే ఈ మార్కెట్‌కు రైతులు భారీగా పసుపును తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా రెండు రకాల పసుపు వచ్చింది. ఒకటి కాడి రకం , మరొకటి గోళ రకం . కాడి రకం పసుపును ఏడుగురు రైతులు 69 బస్తాల్లో తీసుకురాగా.. గోళ రకం పసుపును ముగ్గురు రైతులు 30 బస్తాల్లో మార్కెట్ కు తీసుకువచ్చారు. మార్కెట్ అధికారులు ఈ-నామ్ విధానంలో ఆన్లైన్ ఈ-వేలం నిర్వహించారు. ఈ వేలంలో వ్యాపారులు పోటీ పడి మరీ పసుపును కొనుగోలు చేశారు. ధరల వివరాలు చూస్తే రైతులకు పండగే అని చెప్పాలి. కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా 19 వేల 253 ధర పలకగా, కనిష్ఠంగా 15 వేల 589 రూపాయలు పలికింది. ఇక ఈ రకం సగటు ధర చూసుకుంటే 19 వేల 252 పలకడం విశేషం. అంటే దాదాపు తెచ్చిన పసుపు మొత్తానికి అత్యధిక ధరే లభించింది. ఇక గోళరకం పసుపు విషయానికి వస్తే, గరిష్ఠంగా 18వేల 566 రూపాయలు పలకగా, కనిష్ఠంగా 8,506 రూపాయలు, సగటున 17వేల 469 రూపాయల తో వ్యాపారులు సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో కేసముద్రం మార్కెట్ చరిత్రలో ఈ స్థాయి ధర నమోదు కావడం ఒక రికార్డు అని మార్కెట్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం రెండు రోజుల వ్యవధిలో పసుపు ధర ఇంతలా పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది అసలు విషయం ఈ మార్కెట్ కు రెండురోజుల సెలవుల కంటే ముందు, అంటే ఈ నెల 22వ తేదీన పసుపు విక్రయానికి వచ్చినప్పుడు.. క్వింటాకు గరిష్టంగా 13,319 వరకే ధర నమోదైంది. కానీ ఇప్పుడు ఏకంగా 19,253 పలికింది. క్రితం మార్కెట్‌తో పోలిస్తే ఒకేసారి క్వింటాకు 6,000 పెరిగి 19 వేల మార్క్ దాటడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం నాణ్యత . ఈసారి మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన పసుపు నాణ్యత అత్యద్భుతంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పసుపునకు, ముఖ్యంగా తెలంగాణ పసుపునకు ఉన్న భారీ డిమాండ్ కూడా ఈ ధరల పెరుగుదలకు పరోక్షంగా సహాయపడింది.
గతంలో రైతులు పసుపు బస్తాలు తీసుకుని మార్కెట్ కు వెళితే, అక్కడ దళారులు సిండికేట్ గా మారి ధరను అమాంతం తగ్గించేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నామ్ విధానం పసుపు రైతులకు ఒక వరంలా మారింది. ఈ ఈ-నామ్ విధానం ద్వారా రైతులు తెచ్చిన పంటను ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రిజిస్టర్డ్ వ్యాపారులు ఎవరైనా వేలంలో పాడుకోవచ్చు. రైతులు తెచ్చిన పసుపు నాణ్యతను ముందుగానే ల్యాబ్ లో టెస్ట్ చేసి, ఆ రిపోర్ట్ ను ఆన్లైన్లో పెడతారు. అది చూసి వ్యాపారులు పోటీ పడి బిడ్డింగ్ వేస్తారు. అత్యధిక ధర కోట్ చేసిన వ్యాపారికి ఆ పంట వెళుతుంది. దళారుల ప్రమేయం జీరో. డబ్బులు కూడా నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే జమవుతాయి. కేసముద్రం మార్కెట్లో ఇప్పుడు పసుపునకు ఇంత అద్భుతమైన ధర రావడానికి, రైతులు ఏమాత్రం నష్టపోకుండా ఉండటానికి ఈ పారదర్శకమైన ఈ-నామ్ విధానమే ప్రధాన కారణం. ఈ ధరల ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో పసుపు ధర మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.



