టార్గెట్ 2029 పవన్ ప్లానింగ్ అదుర్స్… తెలంగాణ రాజకీయాల్లో దూకుడు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించి, ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ పాలన అందిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ . ఇక మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జనసేన సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు పార్టీ అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. ఒక సాధారణ ప్రక్షాళన కాదు.. ఏకంగా పాత కమిటీలను, ఇన్చార్జ్ పదవులను మూకుమ్మడిగా రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జనసేన పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి స్ట్రాంగ్ చేయడానికి అధిష్ఠానం కఠిన నిర్ణయాలు తీసుకుంది. యాక్టివ్గా ఉండే నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు మినహా, జూన్ 2, 2026 కు ముందు రాష్ట్రంలో వేసిన అన్ని రకాల పదవులను రద్దు చేస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. అంటే జూన్ 2కి ముందున్న అన్ని పార్లమెంట్, జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్ పదవులు , జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల ఇన్చార్జ్ పదవులు రద్దయ్యాయి. అంతేకాదు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ , విద్యార్థి విభాగం, యువజన విభాగం, వీరమహిళా విభాగాలతో పాటు.. ఇటీవల ఏర్పాటు చేసిన పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోఆర్డినేటర్లు, పాత-కొత్త అడ్హక్ కమిటీలు.. ఇలా మొత్తంగా సంస్థాగత నిర్మాణాన్ని రద్దు చేసి క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. జూన్ 2, 2026 తర్వాత ఏర్పాటైన జనసేన తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ, అలాగే పార్టీ అధికార ప్రతినిధులు మాత్రం యధావిధిగా కొనసాగుతారని పార్టీ స్పష్టం చేసింది.
పవన్ టార్గెట్ ఇప్పుడు 2029 ఎన్నికలు . తెలంగాణలో 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేసేలా ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే కాదు.. అంతకుముందే జరగనున్న ప్రతి స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని జనసేన పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది. రాబోయే జీహెచ్ఎంసీ , ఎంఎంసీ , కార్పొరేషన్ ఎన్నికలతో పాటు.. గ్రామ స్థాయిలో ఉండే జెడ్పీటీసీ , ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఈసారి పూర్తిస్థాయిలో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో జనసేన అంటే కేవలం మద్దతు ఇచ్చే పార్టీగానో, లేదా కొన్ని సీట్లకే పరిమితమయ్యే పార్టీగానో ఉన్న ముద్రను చెరిపేయాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తూనే, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నదే ఈ పునర్వ్యవస్థీకరణ వెనుక ఉన్న అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.



