ఆమె ఎంట్రీకి ముందే బంగ్లాదేశ్‌లో కలకలం.. మళ్లీ ఎందుకీ ఉద్రిక్తతలు?

2024 లో జరిగిన భారీ ప్రజా తిరుగుబాటుతో ప్రధాని పదవిని కోల్పోయి, ప్రాణభయంతో దేశం విడిచి ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ లో తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎంట్రీకి ముందే బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తకర పరిస్థితులు తలెత్తడం సంచలనంగా మారింది. ఆమె రీ-ఎంట్రీకి పెట్టిన డిసెంబర్ గడువు దగ్గరపడుతుండగా బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. వీధుల్లో బాంబు పేలుళ్లు.. బస్సులు, వాహనాలకు నిప్పు.. పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు.. ఇలా వరుస ఘటనలతో దేశంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ హింస వెనుక కచ్చితంగా హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తల హస్తం ఉందని తాత్కాలిక ప్రభుత్వం ఆరోపిస్తోంది. అక్టోబర్ చివరి వారం నుంచి అకస్మాత్తుగా హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. రాజధాని ఢాకాతో పాటు గాజీపూర్, గోపాల్‌గంజ్, షరియత్‌పూర్ తదితర ప్రాంతాల్లో రోజూ ఎక్కడో ఒకచోట బాంబు పేలుళ్లు, వాహనాల దహనాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నవంబర్ 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా కనీసం 22 అగ్నిప్రమాదాలు, బాంబు పేలుళ్ల ఘటనలు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడులన్నింటి వెనుకా నిషేధిత అవామీ లీగ్ కార్యకర్తలే ఉన్నారని, పక్కా ప్రణాళికతోనే వారు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌ను , దాని అనుబంధ విద్యార్థి సంఘాలను బ్యాన్ చేసింది. అయితే ఆ నిషేధిత అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ నవంబర్ 10న ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులపై భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. షరియత్‌పూర్‌లో ఢాకా-భంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిరసనకారులు వందల సంఖ్యలో వచ్చి దిగ్బంధించారు. వాహనాలపై దాడులు చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హసీనా సొంత ప్రాంతమైన గోపాల్గంజ్లోనూ పోలీసులతో ఆందోళనకారులు తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో నేరుగా పోలీసు వాహనాలనే ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కంట్రోల్ చేయడానికి ఆర్మీతో సమానమైన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బలగాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. వీధుల్లో ఎక్కడ చూసినా లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలతో బంగ్లాదేశ్ రణరంగాన్ని తలపిస్తోంది.
రాజకీయ అల్లర్లు ఒకవైపు అయితే, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వస్త్ర పరిశ్రమల కార్మికుల నిరసనలు ఈ హింసను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో గార్మెంట్ వర్కర్లకు నెలకు 12,500 టాకాలుగా ఉన్న కనీస వేతనాన్ని, వెంటనే 30 వేల టాకాలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ధరలు పెరిగిపోయాయని, ఈ జీతంతో బతకలేకపోతున్నామని వారు రోడ్లపైకి వచ్చారు. ఢాకా, గాజీపూర్, సావర్ లాంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కొన్ని చోట్ల పోలీసులతో కార్మికులకు ఘర్షణలు జరిగాయి. వందలాది కార్మికులు ఫ్యాక్టరీలు, గోదాములపై దాడులు చేసి అద్దాలు పగులగొట్టారు. పరిస్థితులు అదుపు తప్పడంతో వందలాది వస్త్ర పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే ఈ కార్మికుల ముసుగులో కూడా అవామీ లీగ్ కార్యకర్తలే చొరబడి ఫ్యాక్టరీలపై దాడులు చేస్తున్నారని ఫ్యాక్టరీ యజమానులు అనుమానిస్తున్నారు. దేశంలో జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనల వెనుక, ముఖ్యంగా ఈ బాంబు పేలుళ్ల వెనుక నిషేధిత అవామీ లీగ్ కార్యకర్తలు ఉన్నారని బంగ్లాదేశ్ పోలీసులు అధికారికంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే వారి ప్రధాన లక్ష్యమని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. హసీనా రీ-ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని వారు అనుమానిస్తున్నారు. ఈ దాడులను అదుపు చేయడానికి పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్స్ ప్రారంభించారు. నవంబర్ 1 నుంచి 7 వరకు జరిగిన బాంబు పేలుళ్ల కేసుల్లో కనీసం 21 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అదే సమయంలో అవామీ లీగ్‌తో ప్రత్యక్షంగా సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఏకంగా 898 మందిని వేర్వేరు పోలీసు తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎంతమందిని అరెస్ట్ చేసినా ఆందోళనలు ఆగకపోవడంతో.. ఈ నిరసనలను కేవలం రాజకీయ కోణంలోనే చూడలేమని, కార్మికుల ఆకలి కేకలు కూడా ఇందులో ఉన్నాయని కొన్ని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి.



