పశ్చిమాసియాలో హై టెన్షన్..హమాస్ అడ్డాలో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడి

ఒక్కసారిగా మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 2025 అక్టోబర్ నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండి, గాజాలో పరిస్థితులు చక్కబడుతున్నాయని ప్రపంచం భావిస్తున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ భారీ భూతల దాడికి దిగింది. అది కూడా నేరుగా హమాస్ ఆధీనంలో ఉన్న మధ్య గాజా ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైనికులు భారీ ట్యాంకులతో దూసుకెళ్లారు. కొన్ని అంతర్జాతీయ కథనాల ప్రకారం మధ్య గాజాలోని హమాస్ ఆధీన ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం అత్యంత పక్కా ప్రణాళికతో ఈ భూతల ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ , ఆ దేశ అత్యంత కీలకమైన అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ సంయుక్తంగా ఈ సైనిక చర్యను చేపట్టాయి. 2025 అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, గాజా ప్రాంతాన్ని ఎల్లో లైన్ ద్వారా రెండు స్పష్టమైన భాగాలుగా విభజించారు . ఒకవైపు ఇజ్రాయెల్ ఆధీన ప్రాంతం, మరోవైపు హమాస్ ఆధీన ప్రాంతం. ఇజ్రాయెల్ సైన్యం చెబుతున్న లెక్కల ప్రకారం.. ఇప్పటికే గాజాలోని 60 శాతానికి పైగా భూభాగం పూర్తిగా ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉంది. మిగిలిన ప్రాంతం ఎల్లో లైన్‌కు పశ్చిమాన హమాస్ ఆధీనంలో ఉంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం నేరుగా ఆ ఎల్లో లైన్‌ను దాటి, పశ్చిమ వైపు ఉన్న హమాస్ ప్రాంతంలోకి ట్యాంకులతో చొచ్చుకెళ్లింది. ఎల్లో లైన్‌కు పశ్చిమాన ఉన్న ఒక హమాస్ సొరంగం తమ సైనికులకు తక్షణ ముప్పుగా మారిందని ఇజ్రాయెల్ సైన్యం, షిన్ బెట్ ప్రకటించాయి. సరిహద్దు వద్ద ఉన్న తమ దళాలపై దాడి చేయడానికి హమాస్ ఈ సొరంగాన్ని ఉపయోగించే ప్రమాదం ఉందన్న నిఘా సమాచారంతోనే, ఆ సొరంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. బురైజ్, నుసైరత్ శరణార్థి శిబిరాల సమీపంలో ఇజ్రాయెల్ ట్యాంకులు ప్రవేశించి, ఫిరంగి దాడులు మొదలవ్వడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ ఇళ్లను, తాత్కాలిక నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ కుటుంబాల్లో చాలామంది గతంలో జరిగిన యుద్ధం కారణంగా ఇప్పటికే పలుమార్లు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన వారే ఉండడం కలచివేసే అంశం. 2025 అక్టోబర్ కాల్పుల విరమణ తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుని తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న వేలాది మంది, ఇప్పుడు మరోసారి సామాన్లు సర్దుకుని వలస వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఎల్లో లైన్ దాటి ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఆధీన ప్రాంతంలోకి ప్రవేశించడం అనేది కేవలం ఒక సొరంగం ధ్వంసానికి మాత్రమే పరిమితం అవుతుందా? లేక 2025 అక్టోబర్ నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా కుప్పకూల్చి, గాజాలో మరోసారి పూర్తి స్థాయి భీకర యుద్ధానికి దారితీస్తుందా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అతిపెద్ద ఆందోళన. ఇప్పటికే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పశ్చిమాసియా అంతటా ఉద్రిక్తంగా ఉండగా మళ్లీ మధ్య గాజాలో ఇజ్రాయెల్ భూతల దాడి అక్కడి పరిస్థితులను మరింత వేడెక్కించింది.



