పాకిస్థాన్ లో విభజన చిచ్చు.. భగ్గుమన్న బిలావల్ భుట్టో!

పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లోనే అస్థిరతకు మారుపేరు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలో ఇప్పుడు మరో భారీ రాజకీయ భూకంపం రాబోతోంది. ఈసారి ఏకంగా పాకిస్థాన్ రాజకీయ మ్యాప్‌నే పూర్తిగా మార్చేసే ఒక సంచలన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న నాలుగు ప్రధాన ప్రావిన్సులను విభజించి, ఏకంగా 12 నుంచి 15 చిన్న ప్రావిన్సులుగా.. లేదంటే 160 చిన్న పరిపాలనా యూనిట్లుగా మార్చాలని పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ , రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వంటి కీలక నేతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు రావడంతో పాకిస్థాన్ ఒక్కసారిగా భగ్గుమంది. ముఖ్యంగా ఈ ప్రతిపాదనపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జార్దారీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బలవంతంగా సింధ్ ప్రావిన్స్‌ను విభజించే ప్రయత్నం చేస్తే.. కరాచీ, హైదరాబాద్ లలో భీకర హింస, రక్తపాతం తప్పదు.. సామాన్య ప్రజలే ఆయుధాలు పడతారు అంటూ బిలావల్ భుట్టో నేరుగా హెచ్చరికలు జారీ చేశారు.
పాకిస్థాన్‌లోని ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం, కరాచీ ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో బిలావల్ భుట్టో-జార్దారీ అత్యంత ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్‌ను మరిన్ని రాష్ట్రాలుగా విభజించే క్రమంలో సింధ్ ప్రావిన్స్‌ను బలవంతంగా ముక్కలు చేయాలనే ఆలోచనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్య వల్ల సింధ్‌లోని కీలక నగరాలైన కరాచీ, హైదరాబాద్‌లలో తీవ్రమైన హింసాకాండ, రక్తపాతం చెలరేగుతుందని ఆయన స్పష్టం చేశారు.
బయటకు వస్తున్న వార్తల ప్రకారం.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశంలోని పరిపాలనా సవాళ్లను పరిష్కరించడానికి ఏకంగా 12 నుంచి 15 కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయడానికి, దేశాన్ని దాదాపు 160 చిన్న పరిపాలనా యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించడానికి ప్రణాళికను పరిశీలిస్తున్నారట . ఈ ప్రతిపాదనకు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా బహిరంగంగానే మద్దతు పలికారు. పాకిస్థాన్‌లో వేగంగా పెరుగుతున్న జనాభాకు మెరుగైన పరిపాలన, ప్రజా సేవలు అందించాలంటే చిన్న రాష్ట్రాలు తప్పనిసరి అని వాదించారు. భాషా, జాతి లేదా రాజకీయ ప్రాతిపదికన కాకుండా, కేవలం పరిపాలనా అవసరాల ఆధారంగా సరిహద్దులు నిర్ణయిస్తే పాకిస్థాన్ 12 ప్రావిన్సులను ఏర్పాటు చేసుకోవచ్చని ఖవాజా ఆసిఫ్ సమర్థించారు. అయితే రాజకీయ పార్టీల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్ విభజన అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే సింధ్ ప్రావిన్స్ అనేది భుట్టో-జార్దారీ కుటుంబానికి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి దశాబ్దాలుగా అత్యంత బలమైన రాజకీయ కోట. ఒకవేళ సింధ్‌ను విభజిస్తే, ముఖ్యంగా కరాచీ, హైదరాబాద్ లాంటి ఆర్థిక కేంద్రాలను విడదీస్తే పీపీపీ రాజకీయ ఉనికికే పెద్ద దెబ్బ తగులుతుంది. అయితే, బిలావల్ భుట్టో తన వాదనను అత్యంత తెలివిగా రాజ్యాంగ కోణంలో వినిపించారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు పీపీపీ వ్యతిరేకం కాదని చెబుతూనే, అది కేవలం ప్రజల ఇష్టానుసారం, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు. ప్రజల ఆమోదం, రాజ్యాంగం, చట్టానికి లోబడి ప్రావిన్సుల ఏర్పాటుకు పీపీపీ మద్దతు ఇస్తుంది. కానీ బలవంతం, ఒత్తిడి ద్వారా చేసే విభజనను మేము అస్సలు అంగీకరించం అని బిలావల్ తేల్చి చెప్పారు. అంతేకాదు, కొత్త ప్రావిన్సుల విషయంలో రెఫరెండం నిర్వహించవచ్చనే సూచనలపైనా బిలావల్ ఫైర్ అయ్యారు. కొత్త ప్రావిన్సులను ఎలా ఏర్పాటు చేయాలో పాకిస్థాన్ రాజ్యాంగంలోనే స్పష్టమైన విధానం ఉందని, అలాంటప్పుడు రాజ్యాంగేతర మార్గాలను వెతికితే పీపీపీ ఎలా మద్దతు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ చరిత్రలో రెఫరెండంలను ఎప్పుడూ అప్రజాస్వామిక ప్రయోజనాల కోసమే వాడుకున్నారని ఇక్కడ సమస్య రెఫరెండం కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశం అని బిలావల్ సూటిగా కౌంటర్ ఇచ్చారు.



