పాక్ మంత్రికి నో ఎంట్రీ.. ఆ ప్రదేశాలు చూస్తానన్న పాక్ మంత్రి భారత్ ఇచ్చిన జవాబుకు మైండ్ బ్లాక్

అంతర్జాతీయ సదస్సుల ప్రొటోకాల్‌ను గౌరవించడానికి దాయాది దేశానికి అనవసరమైన చనువు ఇవ్వడానికి మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి చేతల్లో నిరూపించింది. నవంబర్ 20- 22 వరకు న్యూఢిల్లీ వేదికగా ఎస్సీఓ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాకిస్థాన్ తరఫున పాల్గొనేందుకు మంత్రి ముసాదిక్ మాలిక్ సారథ్యంలో పాక్ ప్రతినిధి బృందం భారత్‌కు చేరుకుంది. సాధారణంగా విదేశీ మంత్రులు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను, నగరంలోని చారిత్రక కట్టడాలను చూడటానికి ఆసక్తి చూపుతుంటారు. అదే తరహాలో పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ సైతం ఆగ్రాలోని తాజ్‌మహల్‌తో పాటు, న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు అనుమతి కోరారు. అయితే, ప్రస్తుత భారత్-పాక్ సంబంధాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అభ్యర్థనను కఠినంగా తిరస్కరించింది. తాజ్‌మహల్, దర్గా సందర్శనకు ఆయనకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దౌత్యపరమైన వీసా నిబంధనల ప్రకారం ఆయన పర్యటన పూర్తిగా ఎస్సీఓ సదస్సు వేదికకే పరిమితమని, అదనపు పర్యటనలకు ఎలాంటి వెసులుబాటు లేదని భారత్ స్పష్టం చేసింది.
కొద్ది నెలల క్రితం ఇదే మంత్రి పాకిస్థాన్ గడ్డపై నిలబడి, సింధూ జలాల విషయంలో భారత్‌పై నిప్పులు చెరిగారు. తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు భారత్‌లో అడుగుపెట్టగానే ఆయన స్వరం మారింది. సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముసాదిక్ మాలిక్.. ఎస్సీఓ దేశాల నాగరికతలు, సంస్కృతిపై చర్చించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సంస్కృతి, నాగరికతలకు ఎలాంటి సరిహద్దులు ఉండవు అంటూ శాంతి వచనాలు పలికారు. మన చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, నాగరికతలపై చర్చించేందుకు భారత్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. షాంఘై సహకార సంస్థలోని సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వంపై చర్చించి, దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ వేదికలో పాల్గొనడానికి వివిధ సభ్య దేశాల ప్రతినిధులు ఢిల్లీకి తరలివచ్చారు. మరోవైపు, ఎస్సీఓలో ప్రస్తుతం పాకిస్థాన్ పాత్ర కూడా కీలకంగా ఉంది. 2026-27 సంవత్సరానికి గాను ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ కు పాకిస్థాన్ సారథ్యం వహిస్తోంది. దీనివల్ల వచ్చే ఏడాది జరగనున్న ప్రధాన శిఖరాగ్ర సమావేశాల్లోపు పలు కీలక సదస్సులకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. బహుళపక్ష అంతర్జాతీయ సంస్థలో సభ్య దేశంగా ఉన్నందువల్లే భారత్ ప్రొటోకాల్ ప్రకారం పాక్ బృందానికి ఈ సదస్సులో పాల్గొనేందుకు వీసా మంజూరు చేసింది. తాజ్‌మహల్, నిజాముద్దీన్ దర్గా సందర్శనకు పాక్ మంత్రికి అనుమతి నిరాకరించడం వెనుక భారత్ పంపిన దౌత్య సందేశం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే.. అంతర్జాతీయ వేదికల మర్యాద కోసం ఎస్సీఓ సదస్సుకు మిమ్మల్ని ఆహ్వానించామే తప్ప, భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి వచ్చాయని కాదునే మెసేజ్ ను స్పష్టంగా ఇచ్చింది. ఒకవేళ పాక్ మంత్రిని ఆగ్రాకు, దర్గాలకు అనుమతించి, అక్కడ ఆయన ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తే.. అది దేశీయంగా, అంతర్జాతీయంగా తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌ను బెదిరించిన మంత్రిని ఢిల్లీకి ఎందుకు పిలిచారంటూ దేశీయంగా విమర్శలు వినిపిస్తున్న వేళ, కేంద్రం ఎక్కడా రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించింది.



