పైలట్లు వచ్చే వరకు ఆగని ట్రంప్.. ఆ రాత్రి ఇరాన్లో ఏం జరిగింది?

2025 జూన్ 22న ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడిలో పాల్గొన్న అమెరికా బీ-2 బాంబర్ పైలట్లు, 'ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సాధారణంగా రహస్య సైనిక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది సురక్షితంగా స్థావరాలకు చేరుకునే వరకు ఆ వివరాలు గోప్యంగా ఉంచుతారు. అయితే, తమ విమానాలు ఇంకా మార్గమధ్యంలో గాల్లో ఉండగానే, భద్రతా నియమాలను పక్కనపెట్టి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఆపరేషన్ వివరాలను బహిర్గతం చేశారని పైలట్లు స్వయంగా తెలిపారు.
2025 జూన్ 22వ తేదీ ఆ రోజు అమెరికా తూర్పు వైపు నుంచి బయలుదేరిన అత్యంత శక్తిమంతమైన బీ-2 స్పిరిట్ బాంబర్ విమానాలు దాదాపు 18 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించి ఇరాన్ సమీపానికి చేరుకున్నాయి. సుదీర్ఘ ప్రయాణం తర్వాత తాము ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపానికి చేరుకున్నట్లు పైలట్లు గుర్తించారు. ఆ తర్వాత 30 వేల పౌండ్ల బరువుండే రెండు భారీ బంకర్ బస్టర్ బాంబులను టార్గెట్ పై వదిలారు. బాంబులు భూమిని తాకిన సరిగ్గా 15 సెకన్ల తర్వాత భూగర్భంలో జరిగిన భారీ విస్ఫోటనంతో దాదాపు 10 అంతస్తుల ఎత్తులో ఒక మహా అగ్నిగోళం ఆకాశంలోకి ఎగసిపడింది. ఆ కారుచీకటి అర్ధరాత్రిలో చుట్టుపక్కల ఉన్న భారీ పర్వతాలన్నీ ఆ మంటల వెలుగులో పట్టపగలులా స్పష్టంగా కనిపించాయని ఆ దాడిలో పాల్గొన్న పైలట్లు తమ ఇంటర్వ్యూలో వివరించారు. ఇరాన్ ఫోర్డోలో పర్వతాల కింద అత్యంత రహస్యంగా అణు కేంద్రాన్ని నిర్మించిందని అమెరికా ఏకంగా 2009లోనే గుర్తించింది. అప్పటి నుంచి దాన్ని ఎలా ధ్వంసం చేయాలన్న దానిపై అమెరికా రక్షణ నిపుణులు ఏళ్ల తరబడి కసరత్తు చేస్తూనే ఉన్నారు. అమెరికా పక్కా ప్లాన్ వేసింది. అయితే సరిగ్గా దాడికి కొద్ది రోజుల ముందే ఇరాన్ ప్రమాదాన్ని పసిగట్టి ఆ వెంటిలేషన్ షాఫ్ట్లన్నింటిపైనా దట్టమైన కాంక్రీట్ పొరను వేసినట్లు అమెరికా శాటిలైట్లు గుర్తించాయి. దాడి సమయంలో ముందుగా ఆ కాంక్రీట్ కవచాన్ని పగలగొట్టడం అత్యంత కీలకంగా మారింది. దీంతో ఏళ్ల తరబడి సిద్ధం చేసిన అమెరికా ప్లాన్ మొత్తం చివరి నిమిషంలో మారిపోయింది.



