బంగ్లాదేశ్‌లో లాక్డౌన్..భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం బంగ్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వస్తున్నానని షేక్ హసీనా ప్రకటించిన వెంటనే బంగ్లాదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిషేధంలో ఉన్నప్పటికీ అవామీ లీగ్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు ప్రభావంతో నవంబర్ 19న బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వార్తా నివేదికల ప్రకారం బుధవారం నుంచి గురువారం వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, పెట్రోల్ బాంబుల పేలుళ్లు, పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విధ్వంసం వెనుక అవామీ లీగ్ హస్తం ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించేందుకు ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దించింది. ముఖ్యంగా సున్నితమైన ఏడు జిల్లాల్లో సుమారు 3,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఢాకా, చిట్టగాంగ్, నారాయణ్‌గంజ్, గాజీపూర్, గోపాల్‌గంజ్, మయమన్సింగ్, ఫరీద్పూర్ జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ విభాగానికి చెందిన 96 ప్లాటూన్లను ప్రభుత్వం నియమించింది.బంగ్లాదేశ్‌లో భద్రతను ఇంతగా కట్టుదిట్టం చేసినప్పటికీ, గత రెండు రోజులుగా చోటుచేసుకున్న ఘటనలు అక్కడి పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు షేక్ హసీనాకు మద్దతుగా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో దాడులు, పోలీస్ స్టేషన్లకు నిప్పుపెట్టడం, పెట్రోల్ బాంబుల పేలుళ్లతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ హింసాత్మక ఘటనల్లో ప్రాణనష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ నరైల్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో అధికార బీఎన్పీకి చెందిన ఇద్దరు స్థానిక నాయకులు మరణించారు. గత రెండు రోజుల్లో నైరుతి ప్రాంతాలైన ఫరీద్పూర్, పిరోజ్పూర్లలో చోటుచేసుకున్న ఘటనల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఢాకాలోని రద్దీగా ఉండే అగర్గావ్ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు మెట్రో రైలు స్టేషన్ కింద నాటు బాంబును పేల్చడం కలకలం రేపింది.
ఒకవైపు ప్రభుత్వం అవామీ లీగ్‌పై ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు అధికార బీఎన్పీ కార్యకర్తలు సైతం ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం. ఢాకాలో అవామీ లీగ్‌కు చెందిన ఇద్దరు నాయకుల ఇళ్లపై బీఎన్పీ కార్యకర్తలు దాడి చేసి నిప్పుపెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు 2024 రాజకీయ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరించిన మహ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిని కొందరు కాల్చివేశారు. మహ్మద్ యూనస్ హయాంలోనే అవామీ లీగ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో, ఆయన పూర్వీకుల ఇంటిపై జరిగిన ఈ దాడి బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఈ అంశంపై అత్యంత కఠినమైన వైఖరిని ప్రకటించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్లో ప్రసంగించిన ఆయన, షేక్ హసీనా , అవామీ లీగ్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని తారిఖ్ రెహ్మాన్, అవామీ లీగ్‌ను ఒక ఉగ్రవాద సంస్థగా, ఓడిపోయి అధికారం కోల్పోయిన ఫాసిస్ట్ శక్తిగా అభివర్ణించారు. 2024లో నిరంకుశ శక్తులను దేశం నుంచి తరిమికొట్టినప్పుడు ప్రజల్లో ఏ స్ఫూర్తి అయితే ఉందో, అదే స్ఫూర్తితో ఇప్పుడు మరోసారి ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. తమపై ఉన్న నిషేధాన్ని, ఆరోపణలను సవాలు చేస్తూ అవామీ లీగ్ శ్రేణులు షేక్ హసీనా రాక కోసం సమాయత్తమవుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పోరు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.



