భూమికి దగ్గరగా ఐదు గ్రహశకలాలు.. ఢీకొట్టే ప్రమాదం ఉందా?

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు గ్రహశకలాలు భూమి వైపుగా దూసుకొస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో ఈ ఐదు అంతరిక్ష శిలలు భూమి సమీపం నుంచి ప్రయాణించనున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. 2026 VA11, 2026 TB84, 2026 VD6, 2018 NE1, 2007 WK3 ఈ ఐదు గ్రహశకలాలు భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తున్నాయి. ఈ ఐదు గ్రహశకలాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది 2026 VA11 . ఎందుకంటే, ఈ ఐదింటిలో భూమికి అత్యంత దగ్గరగా ప్రయాణించబోతున్న గ్రహశకలం ఇదే. ఇది భూమికి సుమారు 33.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. సాధారణంగా 33.5 లక్షల కిలోమీటర్లు అంటే చాలా దూరం కదా అని మనకు అనిపించవచ్చు. కానీ అంతరిక్ష కొలమానాల్లో ఇది భూమికి చాలా దగ్గరి దూరంగానే పరిగణిస్తారు. మన భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే.. ఈ గ్రహశకలం దాదాపు 8.72 రెట్లు ఎక్కువ దూరం నుంచి ప్రయాణిస్తోంది. దీని పరిమాణం విషయానికొస్తే, ఈ 2026 VA11 గ్రహశకలం వెడల్పు సుమారు 10 నుంచి 22 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇక దీని వేగం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది సెకనుకు సుమారు 8.9 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకుపోతోంది. అంటే మన కంటి రెప్ప మూసి తెరిచేలోపే దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తుంది. ఇంత వేగంతో వస్తున్నప్పటికీ, దీని కక్ష్యను కచ్చితంగా అంచనా వేసిన శాస్త్రవేత్తలు.. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
మొదటి గ్రహశకలం దగ్గరగా వస్తుంటే, మిగిలిన వాటిలో రెండు గ్రహశకలాలు తమ భారీ పరిమాణంతో, వేగంతో శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భూమి వైపు వస్తున్న గ్రహశకలాల్లో 2026 TB84 పెద్దదిగా గుర్తించారు. దీని వ్యాసం సుమారు 50 నుంచి 110 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 110 మీటర్లు అంటే దాదాపు ఒక భారీ ఫుట్బాల్ మైదానం అంత పరిమాణం ఉంటుంది. ఈ భారీ శకలం నవంబర్ 19, 20 తేదీల్లో భూమికి 46.4 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సురక్షితంగా ప్రయాణించనుంది. ఇక ఈ ఐదింటిలో అత్యంత వేగవంతమైన, అంతే భారీ పరిమాణం కలిగిన మరో గ్రహశకలం 2018 NE1 . దీని వ్యాసం ఏకంగా 50 నుంచి 120 మీటర్ల వరకు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమికి సుమారు 63.8 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. ఈ ఐదు గ్రహశకలాల్లో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నది ఇదే. సెకనుకు సుమారు 13.3 కిలోమీటర్ల వేగంతో ఇది అంతరిక్షంలో దూసుకెళ్తోంది. ఇంత భారీ సైజు, అంతకుమించిన వేగం ఉన్నా 63 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వెళ్తోంది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు.



