మిడిల్ ఈస్ట్ ట్విస్ట్..దిగివచ్చిన సౌదీ యువరాజు.. హౌతీలకు బంపర్ ఆఫర్!

ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన సౌదీ అరేబియా, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల దెబ్బకు విలవిలలాడుతోంది. గత కొన్నేళ్లుగా సౌదీ మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలను టార్గెట్ చేస్తూ హౌతీలు చేస్తున్న డ్రోన్లు , క్షిపణి దాడుల వల్ల ఆ దేశం తీవ్రమైన ఆర్థిక, ప్రాణ నష్టాలను చవిచూస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి జరిగే చమురు ఎగుమతులకు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడుల వల్ల తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలతో విసిగిపోయిన సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎట్టకేలకు హౌతీలతో రాజీకి వచ్చారు.హౌతీలకు ఒక ఆఫర్ ఇచ్చారు.
ఇజ్రాయెల్ మీడియా సంస్థలు, ఇంటర్నేషనల్ ఏజెన్సీలు పబ్లిష్ చేసిన తాజా నివేదికల ప్రకారం ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది. హౌతీలు తమ దేశంపై దాడులను పూర్తిగా ఆపితే ఏకంగా 1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 9,500 కోట్లు ఇస్తామని సౌదీ అరేబియా ఒక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యెమెన్ ప్రభుత్వంతో పోరాడుతున్న హౌతీలకు వ్యతిరేకంగా గతంలో సౌదీ అరేబియా ప్రత్యక్షంగా సైనిక దాడులకు దిగింది. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయి ప్రత్యక్ష పోరు జరుగుతూనే ఉంది. అయితే హౌతీలు వాడే డ్రోన్లు చాలా చౌకైనవి. కానీ వాటిని కూల్చేయడానికి సౌదీ వాడే ప్యాట్రియాట్ మిస్సైల్స్ ఒక్కోటి కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నవి. ఒకవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరిస్తున్న వేళ, తమ దేశ భద్రతను పణంగా పెట్టకూడదని సౌదీ భావించింది. అందుకే హౌతీలను అడ్డుకోవడానికి యుద్ధం కన్నా, వారితో ఒక ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవడమే లాభదాయకమని సౌదీ రాజకుటుంబం నిర్ణయించుకుంది. ఈ 9,500 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని హౌతీలకు డైరెక్ట్ గా కాకుండా, వారి మద్దతుదారులైన ఇరాన్ ద్వారానే అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ భారీ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ స్వయంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లారు. ఆయన మామూలు ప్యాసింజర్ విమానంలో కాకుండా, ఒక ప్రత్యేక సైనిక రవాణా విమానంలో టెహ్రాన్ లో ల్యాండ్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, ఆయన వచ్చిన ఆ సైనిక విమానంలోనే.. హౌతీలకు ఇవ్వదలిచిన 1 బిలియన్ డాలర్ల క్యాష్ ను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆర్థిక లావాదేవీల విషయాన్ని సౌదీ అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అమెరికా లేదా ఇతర పశ్చిమ దేశాల కంటపడకుండా అత్యంత రహస్యంగా ఈ క్యాష్ ట్రాన్స్ ఫర్ జరిగినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఒప్పందం కేవలం సౌదీ , ఇరాన్ మధ్య జరిగింది కాదు. దీని వెనుక ఒక భారీ ఇంటర్నేషనల్ మధ్యవర్తిత్వం ఉంది. టెహ్రాన్‌లో ఇరాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ శాంతి చర్చల్లో కేవలం సౌదీ రక్షణ మంత్రే కాకుండా.. తుర్కియే ఇంటెలిజెన్స్ చీఫ్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ , ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ , ఐఆర్జీసీ సీనియర్ కమాండర్లు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ముఖ్యంగా పాకిస్థాన్ , తుర్కియే దేశాలు ఇరాన్ , సౌదీల మధ్య వారధులుగా పనిచేసి ఈ డీల్ ను సెట్ చేశాయి. ఇరాన్ కూడా ప్రాంతీయ దౌత్య మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవాలని, అమెరికా లేదా ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని ఈ ప్రాంతంలో అడ్డుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. హౌతీలపై ఇరాన్ కు ఉన్న పట్టు అందరికీ తెలిసిందే.
ఈ 1 బిలియన్ డాలర్ల ఒప్పందం గనుక విజయవంతంగా అమలైతే, పశ్చిమాసియాలో చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి. యెమెన్-సౌదీ సరిహద్దులో శాంతి నెలకొంటుంది. సౌదీ చమురు క్షేత్రాలు సేఫ్ గా ఉంటాయి. హౌతీలు ఇకపై తమ దృష్టంతా ఇజ్రాయెల్, అమెరికా నౌకల పైనే కేంద్రీకరించే అవకాశం ఉంది. అయితే అమెరికా కూడా ఈ డీల్ ను అంత తేలికగా వదిలిపెట్టదు. హౌతీల చేతికి ఇంత భారీ మొత్తంలో డబ్బు వెళితే వారు మరింత ప్రమాదకరమైన ఆయుధాలు కొనుగోలు చేస్తారని, అది అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ముప్పు అని అమెరికా వాదిస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో సౌదీ వేసిన ఈ ఎత్తుగడ నిజంగా దాడులను ఆపుతుందా? లేక హౌతీలు డబ్బు తీసుకున్న తర్వాత మళ్లీ కొంతకాలానికి దాడులు మొదలుపెడతారా? అన్నది వేచి చూడాలి.



