మిడిల్ ఈస్ట్ వార్..గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి…హమాస్ టాప్ కమాండర్ హతం!

మిడిల్ ఈస్ట్ మంటలు చల్లారడం లేదు. ఎప్పుడెవరు ఎవరిపై బాంబులు వేస్తారో, ఏ దేశంపై క్షిపణుల వర్షం కురుస్తుందో తెలియని భయానక వాతావరణం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పతాకస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో మరో ఎటాక్ జరిగింది. దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన మెరుపు వైమానిక దాడిలో.. హమాస్‌కు చెందిన టాప్ కమాండర్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. కేవలం గాజాలోనే కాకుండా అటు ఇరాన్, యెమెన్, సౌదీ అరేబియా ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఏకంగా ఆరు డ్రోన్లతో దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు సౌదీ అరేబియాపై యెమెన్ హౌతీ రెబెల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్స్ సౌదీ రక్షణ వ్యవస్థ గాల్లోనే అడ్డుకుంది.
హమాస్ ను తుదముట్టించడమే టార్గెట్ గా ఇజ్రాయెల్ తన మిలిటరీ ఆపరేషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం, ఆ దేశ ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థ షిన్ బెట్ సంయుక్తంగా దక్షిణ గాజా ప్రాంతంలో పక్కా సమాచారంతో భారీ వైమానిక దాడి చేయగా..ఈ దాడిలో హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ అక్కడికక్కడే మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. ఆయన హమాస్ సాయుధ విభాగంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ దాడి తర్వాత, హమాస్ సాయుధ విభాగం కూడా ఆయన మృతిని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ రఫా బ్రిగేడ్‌కు గతంలో నాయెల్ అబూ ఒబైద్ కమాండర్‌గా ఉండేవాడు. గత సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ ఎటాక్ లో అతను మరణించడంతో, ఆ బాధ్యతలను అబూ యూనిస్ చేపట్టారు. కానీ కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆయన కూడా ఇజ్రాయెల్ దాడిలోనే హతమయ్యాడు. ఆదివారం భారీ భద్రత మధ్య ఆయన అంత్యక్రియలను నిర్వహించినట్లు హమాస్ మీడియా తెలిపింది. వరుసగా టాప్ కమాండర్లను కోల్పోతుండటం హమాస్‌కు గట్టి దెబ్బే. పశ్చిమాసియాలో ఏ చిన్న దాడి జరిగినా దాని వెనుక ఇరాన్ ప్రమేయం ఉంటుందన్నది ఇజ్రాయెల్, అమెరికాల బలమైన ఆరోపణ. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక షాకింగ్ ప్రకటన చేశారు. బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరంలోని అత్యంత కీలకమైన రాడార్ వ్యవస్థ ను లక్ష్యంగా చేసుకుని తాము దాడి చేసినట్లు వారు ప్రకటించారు. బహ్రెయిన్‌లోని అల్ రిఫా హెలికాప్టర్ స్థావరంపై ఏకంగా ఆరు పేలుడు డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌కు చెందిన స్టేట్ మీడియా చెబుతోంది. అయితే, ఈ దాడిలో అమెరికా రాడార్ వ్యవస్థ నిజంగానే ధ్వంసమైందా? అక్కడ ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ ఎంత జరిగింది? అనే విషయాలపై అమెరికా పెంటగాన్ నుంచి ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఈ దాడుల ప్రభావంతో బహ్రెయిన్ హోం శాఖ అలెర్ట్ అయింది. దేశవ్యాప్తంగా రెండు అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాంబ్ షెల్టర్స్ , సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.



