యుద్దమైనా…చర్చలైనా..దేనికైనా సిద్ధమంటున్న ఇరాన్…అమెరికా వ్యూహమేంటి?

ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా దాడులతో ఇప్పటికే మిడిల్ ఈస్ట్ రగులుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలుస్తుంటే.. హమాస్, హిజ్బుల్లాకు ఇరాన్ సపోర్ట్ ఉంటోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాక్సీ వార్ కాస్తా డైరెక్ట్ వార్‌గా మారే ప్రమాదం ముంచుకొస్తోంది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ ఒక స్ట్రాంగ్ అల్టిమేటం జారీ చేసింది. అమెరికాతో యుద్ధం లేదా చర్చలు.. దేనికైనా ఇరాన్ వంద శాతం సిద్ధంగా ఉంది అని సంచలన ప్రకటన చేసింది. అమెరికా గనక మరోసారి ఏదైనా ఎటాక్ చేస్తే ఆ యుద్ధ రంగం ఎక్కడ వరకు వెళ్తుందనేది కేవలం ఇరాన్ సాయుధ దళాలే నిర్ణయిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, అమెరికాతో ఏదైనా ఒప్పందం జరగాలంటే తాము విధించిన ఏడు షరతులను అంగీకరిస్తేనే చర్చలకు అవకాశం ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది. అమెరికాతో యుద్ధం లేదా చర్చలైనా సరే ఏ మార్గాన్నైనా ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ సంచలన ప్రకటన చేశారు. ఘాలిబాఫ్ పరోక్షంగా ప్రస్తావించిన ఆ ఏడు షరతుల వెనుక ఇరాన్ దశాబ్దాల రాజకీయ, ఆర్థిక వ్యూహం దాగి ఉంది. ఆ షరతుల్లో ప్రధానమైనవి.. ఇరాన్‌పై అమెరికా విధించిన అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను బేషరతుగా ఎత్తివేయాలి. అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగిన అమెరికా, తిరిగి ఆ ఒప్పందంలోకి వచ్చి ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాక్సీ దళాలైన హిజ్బుల్లా, హౌతీలపై ఎటాక్స్ ఆపాలి, ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు ఇస్తున్న మిలిటరీ సపోర్ట్ అమెరికా ఉపసంహరించుకోవాలి. ఇలాంటి అత్యంత కఠినమైన షరతులను ఇరాన్ ముందు పెట్టింది. అయితే ఈ షరతులను అమెరికా అంగీకరించే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌ను వదిలిపెట్టడం అమెరికా విదేశాంగ విధానంలోనే లేదు. పైగా అమెరికాలో బలమైన ఇజ్రాయెల్ లాబీ ఉంది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందన్న భయం అమెరికాను వెంటాడుతోంది. కాబట్టి ఈ షరతులకు అమెరికా లొంగదు. అంటే పరోక్షంగా ఇరాన్ యుద్ధానికే సై అంటున్నట్లు స్పష్టమవుతోంది.



