రాత్రంతా తనంతట తానే తిరిగిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు..868 సార్లు పార్కింగ్!

చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలు చర్చనీయంశంగా మారాయి. ఖాళీగా ఉన్న అండర్‌గ్రౌండ్ కార్ పార్కింగ్‌లో, లోపల డ్రైవర్ సీటు పూర్తిగా ఖాళీగా ఉన్న ఎలక్ట్రిక్ కారు తనంతట తానుగా రివర్స్ తీస్తూ, మలుపులు తిరుగుతూ మళ్లీ పార్కింగ్ స్థలాల్లోకి వెళ్తూ కనిపించింది. ఏకంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ కారు ఆగకుండా ఇలా తిరుగుతూనే ఉంది. ఆ దృశ్యాన్ని చూసి అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్ నిర్ఘాంతపోయాడు. ఆ దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ తర్వాత కారు ఓనర్ వెహికల్ రికార్డులను పరిశీలించగా, ఒక్క రాత్రిలోనే ఆటోమేటిక్ పార్కింగ్ ఫీచర్ 868 సార్లు పనిచేసినట్లు తేలింది.
కేవలం ఈ ఒక్క కారు మాత్రమే కాదు.. ఇలాంటి ఘటనలకు సంబంధించిన మరిన్ని వీడియోలు కూడా ఆన్లైన్లో కనిపించాయి. దీని వెనుక ఉన్న అసలు కథను చైనాకు చెందిన ఒక ఆటోమొబైల్ న్యూస్ ఏజెన్సీ బయటపెట్టింది. 2026 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 వరకు, హువావే సంస్థ తన రెండో క్వియాన్కున్ ఇంటెలిజెంట్ డ్రైవింగ్ ఓపెన్ పేరుతో 14 రోజుల పాటు ఒక భారీ పోటీని నిర్వహించింది. ఇందులో ఎనిమిది విభాగాల్లో ఏకంగా 1 లక్షా 90వేలకు పైగా కారు యజమానులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఇందులోని పార్కింగ్ ఎలైట్ అనే విభాగంలో విజేతలను ఎవరైతే తమ కారులోని అసిస్టెడ్ పార్కింగ్ ఫీచర్లను ఎక్కువసార్లు విజయవంతంగా ఉపయోగిస్తారో వారికి ఎక్కువ ర్యాంకు ఇస్తారు. ఇందులో ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్ , రిమోట్ పార్కింగ్ అసిస్ట్ , ఎగ్జిట్ అండ్ పార్క్ అసిస్ట్ , పార్కింగ్ లాట్ నావిగేషన్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విభాగంలో టాప్ 100 మంది విజేతలకు హువావే ప్రత్యేక పాయింట్లను బహుమతిగా ఇస్తుంది. హువావే పెట్టిన నిబంధనల ప్రకారం, కేవలం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య చేసిన పార్కింగ్ ప్రయత్నాలను మాత్రమే పోటీ పాయింట్ల కోసం లెక్కిస్తారు. అంటే, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆ కార్లు వందల సార్లు తిరిగినా వాటికి ఒక్క అదనపు పాయింట్ కూడా రాదు. మరి పాయింట్లు రావని తెలిసి కూడా అర్ధరాత్రి వేళ ఆ కార్లు 868 సార్లు ఎందుకు తిరిగాయి? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది!
ఈ పరిణామం వెనుక నిపుణులు ప్రధానంగా మూడు కారణాలను అంచనా వేస్తున్నారు. పోటీలో ఎక్కువ సంఖ్య నమోదు చేసుకోవాలనే ఆశతో, టైమింగ్ నిబంధనలను గమనించకుండా లేదా ప్రయోగం కోసం కారు యజమానులే తమ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కార్లను బయటకు తీసి మళ్లీ మళ్లీ పార్క్ చేసి ఉండొచ్చు. అండర్‌గ్రౌండ్ బేస్మెంట్ పార్కింగ్‌లో సరిపడా వెలుతురు లేకపోవడం, లేదా నేలపై ఉన్న పార్కింగ్ లైన్లు మాసిపోవడం వల్ల కారు సెన్సార్లు గందరగోళానికి గురై, పార్కింగ్ ప్రక్రియ మధ్యలో ఆగిపోయి మళ్లీ మళ్లీ ప్రయత్నించి ఉండొచ్చు. ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్‌లో ఏదైనా సాఫ్ట్వేర్ బగ్ లేదా గ్లిచ్ తలెత్తడం వల్ల, కారు ఒక లూప్‌లో చిక్కుకుని ఆగకుండా వందల సార్లు పార్కింగ్ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు.అయితే, కేవలం సీసీటీవీ ఫుటేజ్‌ను మాత్రమే చూసి ఇది సాఫ్ట్వేర్ లోపమే అని కచ్చితంగా నిర్ధారించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలు ఆ సుదీర్ఘ ప్రక్రియ ఎందుకు మొదలైందో తెలియాలంటే, ఆయా కార్ల వెహికల్ లాగ్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఈ వైరల్ వీడియోలలో కనిపించిన కార్లు సాధారణ కార్లు కావు.. ఇవన్నీ అత్యంత ఆధునిక సెల్ఫ్-డ్రైవింగ్ సాంకేతికత ఉన్న కార్లు. ఈ క్లిప్స్‌లో ప్రధానంగా అవతార్ 06, అవతార్ 11, అవతార్ 12, అలాగే హువాజింగ్ ఎస్ వంటి మోడళ్లు కనిపించాయి. వీటన్నింటిలోనూ హువావే క్వియాన్కున్ ఇంటెలిజెంట్ డ్రైవింగ్ టెక్నాలజీని అమర్చారు. ఈ కార్లకు అత్యంత కీలకమైన ఇంటెలిజెంట్ డ్రైవింగ్ టెక్నాలజీని హువావే అందిస్తోంది. హువావే అభివృద్ధి చేసిన ఏడీఎస్ 3.2 సిస్టమ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందంటే, అసలు పరిచయం లేని కొత్త గ్యారేజీల్లో కూడా ఇది పార్క్-టు-పార్క్ డ్రైవింగ్ చేయగలదు. అలాగే ఇందులోని వాలెట్ పార్కింగ్ డ్రైవర్ ఫీచర్ ద్వారా యజమానులు కారు దగ్గర లేకపోయినా, కేవలం తమ స్మార్ట్‌ఫోన్ సహాయంతో కారును దూరం నుంచే కదిలించి పార్క్ చేసుకోవచ్చు. మనిషి సహాయం లేకుండానే కారు తనంతట తానుగా వెళ్లి పార్క్ చేసుకోవడం అనేది నిజంగా భవిష్యత్తు టెక్నాలజీ అద్భుతమే. కానీ, ఒక్క రాత్రిలో డ్రైవర్ లేకుండా కారు 868 సార్లు కదలడం, పాయింట్ల కోసం నిర్వహించే పోటీలు, లేదా సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల కార్లు ఇలా ఆగకుండా తిరగడం చూస్తుంటే.. ఆటోమేటెడ్ వాహనాల్లో సేఫ్టీ లిమిట్స్, బ్యాటరీ భద్రత, లూప్-ప్రివెన్షన్ వ్యవస్థలు ఎంత అవసరమో స్పష్టంగా అర్థమవుతోంది.



