49 ఏళ్లుగా ఆగని ప్రయాణం.. విశ్వంలో మరో చరిత్ర సృష్టించనున్న వాయేజర్-1..!

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సృష్టించిన వాయేజర్-1 వ్యోమనౌక చరిత్ర సృష్టించింది. 49 ఏళ్లుగా, రాత్రి పగలు అనే తేడా లేకుండా సెకనుకు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూనే ఉంది. మన సౌర కుటుంబాన్ని దాటేసి, ఏ గ్రహాలూ లేని అనంతమైన చీకటి సముద్రంలోకి ఎప్పుడో ప్రవేశించిన ఈ వ్యోమనౌక.. ఇప్పుడు మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతోంది. నవంబర్ 18న వాయేజర్-1.. భూమి నుంచి ఏకంగా ఒక లైట్-డే దూరానికి చేరుకుని కొత్త చరిత్ర సృష్టించబోతోంది. అంటే, కాంతి ఒక రోజంతా ప్రయాణిస్తే ఎంత దూరం వెళుతుందో.. వాయేజర్-1 ఇప్పుడు అంత దూరానికి వెళ్లిపోయింది. కిలోమీటర్లలో చెప్పాలంటే అక్షరాలా 2590 కోట్ల కిలోమీటర్లు.
1977 సెప్టెంబర్ 5న నాసా వాయేజర్-1 ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీని ముఖ్య ఉద్దేశం సౌర కుటుంబంలోని బృహస్పతి, శని గ్రహాలను దగ్గరగా అధ్యయనం చేయడం. అనుకున్నట్లుగానే ఇది ఆ గ్రహాల గుండా ప్రయాణించి, భూమికి అద్భుతమైన ఫొటోలను పంపింది. శని గ్రహ వలయాలు, బృహస్పతి ఉపగ్రహాలైన టైటాన్, అయో లాంటి వాటికి సంబంధించిన ఎన్నో రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ పని పూర్తయిన తర్వాత దీని పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ వాయేజర్-1 టార్గెట్ అది కాదు. గంటకు 60 వేల 773 కిలోమీటర్ల కళ్లు చెదిరే వేగంతో, అది సౌర వ్యవస్థ అంచుల వైపు దూసుకెళ్లింది. అలా దశాబ్దాల పాటు ప్రయాణించి, 2012 ఆగస్టులో మన సూర్యుడి ప్రభావం ముగిసే సరిహద్దును దాటేసింది. అలా నక్షత్రాల మధ్య ఉండే ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి అడుగుపెట్టిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించింది. దాదాపు 16.1 బిలియన్ మైళ్లు అంటే v2,590 కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉంటూ, ఇప్పటికీ అక్కడి వాతావరణం గురించి మనకు డేటాను పంపుతూనే ఉంది.అయితే 2590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయేజర్-1 తో కమ్యూనికేట్ చేయడం సాధారణ విషయం కాదు. భూమి మీదున్న నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ కేంద్రాల నుంచి ఒక సిగ్నల్ లేదా ఒక కమాండ్‌ను పంపితే.. ఆ సిగ్నల్ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసినా వాయేజర్-1 కు చేరుకోవడానికి అక్షరాలా 24 గంటల సమయం పడుతుంది. సిగ్నల్‌ను అది రిసీవ్ చేసుకుని, దానికి ఒక రిప్లై పంపితే.. ఆ రిప్లై మళ్లీ మన భూమిని చేరుకోవడానికి మరో 24 గంటలు పడుతుంది. అంటే నాసా శాస్త్రవేత్తలు ఒక చిన్న మెసేజ్ పంపి, దాని రిజల్ట్ ఏంటో చూడాలంటే ఏకంగా 48 గంటలు ఎదురుచూడాలి. ఇంత దూరం నుంచి అది పంపే సిగ్నల్ ఒక చిన్న బల్బు వెలుగులో కోటి వంతు కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అయినా సరే మన భూమి మీదున్న 70 మీటర్ల భారీ రేడియో డిష్‌లు ఆ చిన్న సమాచారాన్ని కూడా స్పష్టంగా పసిగట్టి డీకోడ్ చేస్తున్నాయి.



