ఇజ్రాయెల్ దెబ్బకు పాకిస్థాన్ పరువు పాయే…పాకిస్థాన్ పైలట్లపై ఉక్కుపాదం..!
కామెంట్లు (0)

ఇజ్రాయెల్ దేశం విధించిన కొత్త నిబంధనల దెబ్బకు, ఫ్రాన్స్ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ పాకిస్థాన్ సహా కొన్ని ఇస్లామిక్ దేశాల పైలట్లపై బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దెబ్బకు ప్రపంచంలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌గా పేరున్న ఒక యూరోపియన్ విమానయాన సంస్థ.. ఆ దేశాల పైలట్లను డ్యూటీల నుంచి తప్పించింది. దీంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏవియేషన్ సెక్టార్లో పాకిస్థాన్ పరువు గంగలో కలిసిపోయింది.
ఇజ్రాయెల్-హమాస్-హిజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ తన సెక్యూరిటీ విషయంలో 100 శాతం పర్ఫెక్ట్గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ఏవియేషన్ అథారిటీ విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ఒక కఠినమైన నోటీసు పంపింది. ఈ నోటీసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న ఫ్రాన్స్ దేశపు టాప్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఫ్రాన్స్.. తమ సిబ్బందికి ఒక ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం.. పారిస్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వెళ్లే ఎయిర్ ఫ్రాన్స్ విమానాల్లో పైలట్లుగా గానీ, కో-పైలట్లుగా గానీ, కనీసం క్యాబిన్ సిబ్బందిగా గానీ పాకిస్థాన్ దేశానికి చెందిన వారు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు లేని 31 దేశాల పౌరులకు ఈ నిషేధం వర్తిస్తుందని ఎయిర్ ఫ్రాన్స్ క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే ఆ దేశాల పాస్‌పోర్ట్ కలిగి ఉంటారో, వాళ్లకు ఇజ్రాయెల్ వెళ్లే విమానాలకు డ్యూటీలు వేయొద్దని రోస్టర్ మేనేజర్లకు కఠిన ఆదేశాలు వెళ్లాయి.
ఇక మరొక ఆసక్తికర అంశం ఏమిటంటే చాలామంది పైలట్లు పాకిస్థాన్, ఇరాన్, లెబనాన్ లాంటి దేశాల్లో పుట్టినా, తర్వాత కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల పౌరసత్వం తీసుకుని డ్యూయల్ సిటిజన్‌షిప్‌తో విదేశీ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు చేస్తుంటారు. అలాంటి వాటికి కూడా ఇజ్రాయెల్ గట్టిగా నో చెప్పేసింది. ఎన్ని దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నా సరే, అందులో ఒకటి పాకిస్థాన్ లేదా ఇరాన్, ఇరాక్, బంగ్లాదేశ్ లాంటి ఈ 31 దేశాల్లో ఏదో ఒక దానికి చెంది ఉంటే.. వారు తమ గగనతంలోకి రావడానికి వీల్లేదు అని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది.దీంతో ఎయిర్ ఫ్రాన్స్ లాంటి భారీ సంస్థలు.. తమ పైలట్ల బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి, వాళ్ళ సెకండ్ పాస్‌పోర్ట్ వివరాలను కూడా ఆరా తీసి మరీ డ్యూటీలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్ పైలట్లకు ఇదొక పెద్ద అవమానంగా, కెరీర్‌కు ఒక మచ్చగా మిగిలిపోనుందని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది.
ఇక ఈ పరిణామాలన్నింటికీ ఆజ్యం పోసింది దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటనే అని ఇజ్రాయెల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, ఫ్లైదుబాయ్ విమానంలో ఓమన్ దేశానికి చెందిన ఒక కో-పైలట్ . ఏకంగా విమాన మెయిన్ కెప్టెన్‌పైనే దాడి చేసి, విమానాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపాయి. ఆ విమానాన్ని ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అవ్వకుండా క్రాష్ చేయాలన్నదే ఆ కో-పైలట్ కుట్ర అని ఆరోపణలు వచ్చాయి. అదృష్టవశాత్తూ భారతీయ కెప్టెన్, ఇతర సిబ్బంది అప్రమత్తమై విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు.
ఈ ఘటనతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్.. విమానయాన సంస్థల సిబ్బంది ద్వారానే తమ దేశానికి ముప్పు పొంచి ఉందని గ్రహించింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా, ఏమాత్రం శత్రుభావం ఉన్న దేశాల పౌరులైనా సరే, వాళ్లను తమ ఎయిర్‌పోర్టుల్లోకి అడుగుపెట్టనివ్వకూడదని ఇజ్రాయెల్ ఈ 31 దేశాల బ్లాక్ లిస్ట్‌ను తెరపైకి తెచ్చింది.



