జపాన్ గగనతలంలో రష్యా అణు బాంబర్లు..ఇదే పుతిన్ స్టైల్ జియో-పాలిటిక్స్..!

ఒక చేతిలో శాంతి చర్చల ప్రకటన.. మరో చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్కేస్, ఆకాశంలో టీయూ-95 అణు బాంబర్లు. ఇదే పుతిన్ స్టైల్ జియో-పాలిటిక్స్. చైనాలో జరిగిన త్రైపాక్షిక భేటీలో వ్యూహాత్మక స్థిరత్వం గురించి మాట్లాడుతూనే, వియత్నాం నుంచి జపాన్, కొరియా, తైవాన్ వరకు రష్యా అణు బాంబర్లను తిప్పి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రదేశాలకు పుతిన్ గట్టి సవాల్ విసిరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, రష్యా వైమానిక దళానికి చెందిన రెండు టీయూ-95 వ్యూహాత్మక అణు బాంబర్లు మంగళవారం వియత్నాంలోని డా నంగ్ నగరానికి చేరుకున్నాయి. వీటికి రక్షణగా, సహాయంగా మరో రెండు రష్యన్ యుద్ధ విమానాలు కూడా వెంట వచ్చాయి. బుధవారం డా నంగ్ విమానాశ్రయంలో ఈ భారీ బాంబర్లు స్పష్టంగా కనిపించాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చారిత్రక అంశం ఉంది. రష్యా , వియత్నాంల మధ్య 1950 నుంచి బలమైన దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే, చివరిసారిగా రష్యా యుద్ధ విమానాలు 2014లో వియత్నాంకు వచ్చాయి. మళ్లీ సరిగ్గా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అది కూడా పుతిన్ చైనా పర్యటనలో ఉన్న కీలక సమయంలోనే రష్యా అణు బాంబర్లు వియత్నాంకు రావడానికి అంతర్జాతీయ రక్షణ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
మరోవైపు, చైనాలో పుతిన్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక దృశ్యం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అణ్వాయుధాల వినియోగాన్ని అనుమతించే అత్యంత రహస్య వివరాలు ఉండే న్యూక్లియర్ బ్రీఫ్కేస్తో ఒక రష్యన్ సైనిక అధికారి పుతిన్ వెంటే కనిపించారు. యాదృచ్ఛికంగా కాకుండా, రష్యా ప్రభుత్వ మీడియా కెమెరాలు ప్రత్యేకంగా ఆ బ్రీఫ్కేస్పైనే ఫోకస్ చేసి ప్రపంచానికి చూపించాయి. గురువారం చైనాలో సమావేశం ముగిసే సమయానికి, అటు డా నంగ్లో ఉన్న ఆ రెండు టీయూ-95 బాంబర్లు కూడా తిరిగి వియత్నాంను వీడాయి.



